రేపటి నుంచి పత్తి మిల్లుల బంద్
జనగామ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అమలు చేస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 కొనుగోలు, 12 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడం, కపాస్ కిసాన్‌న్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ సిస్టం, తదితర నిబంధనలను నిరసిస్తూ తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల17వ తేదీ నుంచి జిల్లాలో పత్తి మిల్లులు, సీసీఐ సెంటర్లు సేవలు(బంద్) నిలిచిపోనున్నాయి. ఈ మేరకు జిల్లా మార్కెట్ అధికారి నరేంద్ర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 15 పత్తి మిల్లులకు గాను, 14 చోట్ల సీసీఐ కేంద్రాలను ప్రా రంభించారు. ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ ద్వారా జనగామ, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో 3,427 మంది రైతుల వద్ద 48,375 క్వింటాళ్ల పత్తి మద్దతు ధరకు కొనుగోలు చేశారు. పత్తి కొనుగోలుకు సంబంధించి రూ.28.82కోట్ల చెల్లింపులకు గాను రూ.18.57 కోట్ల నగదును రైతుల ఖాతాలో జమ చేశారు. ఇంకా రూ.10.25 కోట్ల బ్యాలెన్స్ ఉంది.
సీసీఐ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు
తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి బంద్ పాటిస్తున్న నేపథ్యంలో రైతులు ఎవరూ కూడా కపాస్ యాప్‌లో సీసీఐలో పత్తి అమ్మకం కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని డీఎం నరేంద్ర తెలిపారు. అలాగే పత్తిని ప్రైవేటుగా అమ్ముకునేందుకు జిన్నింగ్ మిల్లులకు సైతం తీసుకు రావద్దని చెప్పారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని, తదుపరి ప్రకటన చేసే వరకు సీసీఐ సెంటర్లు, పత్తి మిల్లుల వద్దకు వచ్చి ఇబ్బంది పడొద్దన్నారు.
సీసీఐ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్
చేసుకోవద్దు
నిబంధనలు మార్చాలంటున్న
వ్యాపారులు


