నవభారత నిర్మాణ ప్రదాత పటేల్
జనగామ రూరల్: నవభారత నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్ల భాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ ఆవరణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్..డీసీపీతో పాల్గొని పటేల్, భరతమాత చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఐక్యతా పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో స్వేచ్ఛ కోసం పటేల్ పరితపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని అన్నారు. దేశాన్ని స్వయం సమృద్ధిగా మా ర్చడానికి ప్రతీ పౌరుడు దేశీయ ఉత్పత్తులను ఉపయోగించు కోవాలని దేశానికి సహకరించాలని ఈ సందర్భంగా ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ మాట్లాడుతూ.. యూనిటీ మార్చ్ 2025 అనేది దేశ ఐక్యతను చాటిచెబుతుందని అన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీవో, గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, వలంటీర్ హరీశ్, రమేశ్ అంజిరెడ్డి, శశిధర్‌రెడ్డి, దేవిలాల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఐక్యతా పాదయాత్రను
ప్రారంభించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా


