హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: హమాలీ కార్మికుల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ భవనంలో ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా 2వ మహాసభ చిట్యాల సోమన్న, బైరగోని బాల్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభను ఉద్దేశించి రాములు మాట్లాడుతూ అన్ని రకాల సరుకుల ఎగుమతి దిగుమతిలో కీలక పాత్ర పోషించే హమాలీ కార్మికుల శ్రమను పాలకులు దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 27న జనగామ పట్టణంలో జరిగే ఆల్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, అన్నెబోయిన రాజు, పొదల నాగరాజు, కోడెపాక యాకయ్య, బోరెల్లి సోమయ్య, యాదగిరి, నరసయ్య, పెంటయ్య, రామచందర్, భాస్కర్, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.
‘బాధ్యులపై చర్యలు
తీసుకుంటాం’
జనగామ: రుద్రమదేవి మహిళా మాక్స్ సొసైటీలో సభ్యుల పొదుపు, అప్పులు, లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం పర్యవేక్షణలో అన్ని వ్యవహారాలు సజావుగా కొనసాగుతున్నాయని స్పెషల్ అఫీషియల్ ఇన్‌చార్జ్ అధికారి దివ్య తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సొసైటీ భూముల కొనుగోలు వ్యవహారాల్లో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభించామని, కోర్టు ఆదేశాల మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంఘానికి చెందిన ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా రక్షించటం ప్రభుత్వ బాధ్యతఅన్నారు. ప్రస్తుతం రుద్రమదేవి మహిళా మాక్స్ సొసైటీ ప్రభుత్వ ఆదీనంలో కొనసాగుతుందని, ఉద్యోగులకు, సభ్యులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానవంతులుగా ఎదగాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ యస్.ఆర్ రంగనాథన్, చాచా నెహ్రూ చిత్ర పటాలకు పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, గ్రంథాలయంలో విజ్ఞానాన్ని పెంపొందించుకొని సద్విని యోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుర్రం భూ లక్ష్మీ నాగరాజు, ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కార్యదర్శి ఎం.సుధీర్, లుంబానాయక్, లైబ్రేరియన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలీలకు సముచితస్థానం కల్పించాలి
చిల్పూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు సముచితస్థానం కల్పిస్తూ అత్యధిక సీట్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్‌కుమార్ అన్నారు. మండలంలోని చిన్నపెండ్యాలలో మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలన్నారు. పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరింత ముందుకు వెళ్లాలన్నారు. హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. అంతకుముందు మండల అధ్యక్షుడు గజ్జల దామోదర్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ చింతకింది కృష్ణమూర్తి, ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గజ్జల దామోదర్, పేరాల నాగభూషణం, వెంకటేశ్వర్లు, గజ్జల రాజేష్, మధు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి


