వాటాల కోసమే బయటకు వచ్చిన కవిత
స్టేషన్‌ఘన్‌పూర్: గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని, కల్వకుంట్ల కుటుంబంలో వాటాల కోసమే కవిత పార్టీ నుంచి వచ్చిందని మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 198 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోటి విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందని, ఇప్పుడు వారి ఆస్తులెంతో వారికే తెలియదని, ఇది తాను అంటున్నది కాదని, కవిత చేసిన ఆరోపణలనే చెబుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం కాదని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ముందుగా కవిత చేస్తున్న ఆరోపణలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్‌లో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లు మంజూరు చేస్తే సరిపోవని అంచనాలను రూ.1,700 కోట్లకు పెంచి రూ.500 కోట్లు అప్పటి మంత్రి హరీశ్‌రావు దోచుకున్నాడని కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు శ్రీధర్‌రావు, లింగాజీ, నూకల ఐలయ్య, తెల్లాకుల రామక్రిష్ణ, వంశీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి


