16 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు
హన్మకొండ: సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకుని ఈనెల 16 నుంచి మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను ఒక ప్రకటనలో తెలిపారు. 2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ముందుగా వనదేవతలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. హనుమకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ప్రతిరోజు ఉదయం 6.10, 7.00, 8.00, 9.00, మధ్యాహ్నం 12.10, 1.00, 1.40, 14.30; రాత్రి 8.20 గంటలకు బస్సులు బయలుదేరుతాయని వివరించారు. అదేవిధంగా మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 5.45, 9.45, 10.15, 11.15, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 4.00, 5.00, 5.30, 6.00 గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. పల్లెవెలుగు బస్సు చార్జీలు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80, ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీలు పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.110గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా, సుఖవంతంగా ప్రయాణించి వనదేవతలను దర్శించుకోవాలని ఆర్‌ఎం విజయభాను కోరారు.
ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం
డి.విజయభాను


