రెండుసార్లు ఫొటో తప్పనిసరి
జనగామ రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు తావులేకుండా కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన నిబంధనలు, సంస్కరణలు తీసుకొస్తోంది. అయినా ఎక్కడో ఒక చోట అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసి, పథకం మరింత పారదర్శకంగా అమలు జరిగేలా ఈకేవైసీ విధానం తీసుకొచ్చింది. ఉపాధి హామీ పథకంలోనూ కూలీలకు ముఖగుర్తింపు హాజరును పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఇప్పటికే ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం’ (ఎన్‌ఎంఎంఎస్) హాజరు నమోదును ఫీల్డ్ అసిస్టెంట్లు అప్‌లోడ్ చేస్తుండగా..ఇక నుంచి మరింత పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈకేవైసీ చేయించుకోని కూలీలు ఉపాధిహామీ పథకానికి దూరం కానున్నారు.
జిల్లాలో 1,27,274 మంది ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్నారు. కూలీలు పనికి రాకున్నా కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు.. నకిలీ, పాత ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఒకరి పేరుతో మరొకరు పనులకు వెళ్లి హాజరు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సామాజిక తనిఖీలో అక్రమాలు బయటపడుతున్నాయి. నిధులు పక్కదారి పడుతున్నట్లు తేలినా రికవరీ అంతంతమాత్రంగానే ఉంటోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ఈ–కేవైసీ తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 1,07,997 మంది కూలీలు ఈ–కేవైసీ చేయించారు.
పనులు పారదర్శకంగా చేపట్టేలా ఉపాధిలో కొత్త విధి విధానాలు రూపొందించారు. పనుల్లో చాలాచోట్ల జాబ్‌కార్డులు ఉన్న ఇంట్లో ఒకరి పేరు మీద జాబ్‌కార్డు ఉంటే వారి బదులు మరొకరు హాజరవుతున్నారు. దీంతో ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పెంచడానికే కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కూలీలు పనిస్థలాల్లో పని చేస్తేనే కూలి చెల్లింపులు జరుగుతాయి. జాబ్‌కార్డు కలిగిన కూలీలే పనులకు హాజరుకావాలి. వారికే వేతనం లభిస్తుంది. వేతనాల చెల్లింపుతోపాటు పని ప్రదేశంలో ఎవరికై నా ప్రమాదం జరిగితే పరిహారం చెల్లించడం సమస్యగా మారుతోంది. ఈక్రమంలో తప్పనిసరిగా జాబ్‌కార్డు ఉండి పనికి హాజరైన కూలీల వివరాలను ఆధార్ అనుసంధానం చేస్తూ ఈకేవైసీ చేస్తున్నారు. ఫొటో తీయగానే ఆధార్ నమోదై ఉన్న బయోమెట్రిక్‌తో ఎవరు హాజరయ్యారో తెలిసిపోతుంది. వీటితోపాటు జియోట్యాగింగ్ ప్రదేశంలో జియో ఫెన్సింగ్ అప్‌డేట్ చేస్తూ పనిప్రదేశాలను సైతం గుర్తించే వీలు కలుగనుంది. పాత చోట్ల మళ్లీ పనులు చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. సిగ్నల్ సాంకేతిక సమస్యలు ఉంటే జిల్లా కోఆర్డినేటర్ పరిష్కరించనున్నారు. కాగా, ఈ అంశాలపై సంబంధిత సిబ్బందికి అవగాహన కల్పించారు.
ముఖగుర్తింపుతో పనుల్లో పారదర్శకత
కూలీలు పనికి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు ఫొటోలు
రెండు ఫొటోలు సరిపోలితేనే హాజరు
ఈ–కేవైసీతో నకిలీలకు అడ్డుకట్ట
ఉపాధి హామీ పథకంలో నూతన
విధానంతో అక్రమాలకు చెక్
కూలీలు పనికి రాగానే ఒకసారి, పనులు పూర్తయిన తర్వాత ఇళ్లకు వెళ్లేటప్పుడు మరోసారి ముఖ ఫొటో తీస్తారు. ఆ తర్వాత ఫొటోలను జీపీఎస్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. కూలీల వివరాలు యాప్‌లో నమోదు కానిపక్షంలో వారు పనులకు వెళ్లినా హాజరువేయలేరు. పనిప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతంలో తీసిన ఫొటోను అప్‌లోడ్ చేస్తే జీపీఎస్ సిస్టం వెంటనే గుర్తిస్తుంది. తప్పడు హాజరుగా నిర్ధారించబడుతుంది. ఈ–కేవైసీ వందశాతం పూర్తయితే ఈజీఎస్‌లో అవకతవకలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఉపాధి..పద్ధతిగా


