గుట్టుగా ‘గుట్కా’ దందా..! | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా ‘గుట్కా’ దందా..!

Nov 14 2025 6:14 AM | Updated on Nov 14 2025 6:14 AM

గుట్టుగా ‘గుట్కా’ దందా..!

గుట్టుగా ‘గుట్కా’ దందా..!

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా మళ్లీ జోరందుకున్న వ్యాపారం

నిషేధం.. నిబంధనలు హుష్‌కాకి

రూ.లక్షల్లో లావాదేవీలు..

నామమాత్రంగా కేసులు

వరంగల్‌ కేంద్రంగా ఇతర ప్రాంతాలకు సరఫరా

సాక్షిప్రతినిధి, వరంగల్‌: నామమాత్రపు పెట్టుబడి.. పది రెట్ల లాభాలు.. అవసరమైతే ముడుపులు.. రకరకాల పేర్లు.. ఆకర్షణీయ ప్యాకింగులు... అమ్మకాల్లో ఇష్టారాజ్యం..పల్లె పట్టణం ప్రాంతమేదైనా చాపకిందనీరులా నిషేధిత గుట్కాల వ్యాపారం నానాటికీ పెరుగుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తరచూ పట్టుబడుతున్న వ్యాపారులు సహా పెరుగుతున్న కేసుల తీవ్రత గుట్కా దందా సాగుతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

పట్టుబడినా, కేసు పెట్టినా షరా‘మామూలే’..

పట్టుబడటం, కేసులు పెట్టుకోవడం షరామాములే..! అనేలా కొందరు వ్యాపారుల తీరు మారిపోయింది. హైదరాబాద్‌ బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారి వరంగల్‌ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసువర్గాల సమాచారం. వరంగల్‌ నుంచి మంచిర్యాల, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ ప్రాంతాలకు కూడా తరలిస్తున్నట్లు తెలిసింది. మహబూబాబాద్‌కు చెందిన ఓ డీలర్‌ ఆర్‌ఆర్‌ ఖైనితోపాటు చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు ఇటీవల ఆరా తీశారు. బెల్లం, గుడుంబా తయారీపై 50కి పైగా కేసులున్న మరొకరు గుట్కా దందా సాగిస్తున్నట్లు తెలిసింది. భూపాలపల్లిలో నిషేధానికి ముందు అంబర్‌, ఆర్‌ఆర్‌ అనార్‌లు విక్రయించే ఓ వ్యాపారి ఇప్పుడు గుట్కా దందా సాగించడం, కేసులు పెట్టినా లైట్‌గా తీసుకుంటుండడంపై చర్చ జరుగుతోంది. ఇదే వ్యాపారి మరొకరితో కలిసి ఛత్తీస్‌గఢ్‌ నుంచి గుట్కాలు తెప్పించి విక్రయిస్తున్నాడు. జనగామ, పరకాల, నర్సంపేట, హుజూరాబాద్‌, ఎల్కతుర్తి, వర్ధన్నపేటలపై పూర్తి ఆధిపత్యం సాధించిన వరంగల్‌ పిన్నవారివీధికి చెందిన ఓ వ్యాపారి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. గతంలో కేసులు కూడా అయ్యాయి. ఇలా చాలామంది వరంగల్‌ను కేంద్రంగా చేసుకుని ఇక్కడ వ్యాపారం చేయడంతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.

రూ.4లది రూ.12–రూ.15లకు..

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు కాకుండా గ్రామాల్లోని చిన్నదుకాణాల్లో సైతం గుట్కాలను అమ్ముతున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.4లకు కొనుగోలు చేసిన దుకాణదారు రూ.12–15 వరకు ఆయా బ్రాండ్‌ వారీగా విక్రయిస్తున్నాడు. ఇలా రోజు మొత్తంలో 20 ప్యాకెట్లను అమ్మితే సుమారు రూ.150–200 వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇందులో రాటుదేలిన వ్యాపారులకు ఈ దందా వల్ల ఒక్క రోజులోనే లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న సందర్భాలున్నాయి. హోల్‌సేల్‌గా 20 ప్యాకెట్లు, 80 ప్యాకెట్లు ఉన్న గుట్కాలను స్థానిక వ్యాపారులకు ఒక్కసారిగా పెద్దమొత్తంలో అందిస్తుండటం వల్ల గంటల వ్యవధిలోనే పెద్ద వ్యాపారులు జేబుల్లో ఊహించని సొమ్మును నింపుకుంటున్నారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో మూడు రోజుల కిందట (11 తేదీన) పెద్ద మొత్తంలో నిషేధిత అంబర్‌, గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పాలకుర్తి నుంచి వరంగల్‌కు కారులో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అలర్టయిన పోలీసులు రూ.6.70 లక్షల విలువైన 13 బస్తాల అంబర్‌, గుట్కా ప్యాట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement