బీమా పాలసీ చేయాలి..
లేదంటే నేనేంటో చూపిస్తా..
● మరో రెండు మండలాల ఎంపీఓలపై ఫిర్యాదుకు సిద్ధం..?
● మధ్యవర్తుల జోక్యంతో బ్రేక్!
● ఎంపీఓల డబ్బుల డిమాండ్ వెనక మర్మమేంటి
● బచ్చన్నపేట ఎంపీఓ సస్పెన్షన్ కాకుండా
ఓ సంఘం మంతనాలు
జనగామ: జిల్లాలో ఎంపీఓ(మండల పంచాయతీ అధికారి)ల బ్లాక్‌మెయిల్ దందా మరోసారి చర్చకు దారితీసింది. పంచాయతీ కార్యదర్శులపై నిరంతరం ఒత్తిడి, వసూళ్ల ఆరోపణలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తాజాగా బచ్చన్నపేట మండల ఎంపీఓపై కార్యదర్శులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఘటనతో ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. అయితే ఫిర్యాదులు మరింతగా వెల్లువెత్తకముందే జిల్లాలోని మరో రెండు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.
జిల్లాలోని మరో రెండు మండలాల ఎంపీఓలపై అక్కడి పంచాయతీ కార్యదర్శులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సెక్రటరీల నుంచి ఫిర్యాదులు కలెక్టర్ వరకు చేరకుండా కొందరు మధ్యవర్తులు అడ్డుకున్నారనే ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. బచ్చన్నపేట ఎంపీఓపై సస్పెన్షన్ డిమాండ్ చేసిన కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగార్చేందుకు ఓ సంఘం రంగంలోకి దిగి గట్టిగానే ప్రయత్నిస్తోందని వినికిడి. సస్పెన్షన్ వేటుపడకుండా, బదిలీతో సరిపెట్టాలనే సంఘ పెద్దలు ఉన్నత స్థాయి అధికారులను సైతం బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇంక్రిమెంట్లు, రాడిఫికేషన్, ప్రొహిబిషన్‌లో ఉన్న సమయం నుంచి రెగ్యులర్‌గా మారే సమయంలో సంబంధిత కార్యదర్శులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కొలువు చేస్తున్నామనే కనీస భయం లేకుండా, కార్యదర్శుల నుంచి నేరుగా ఆన్‌లైన్ పేమెంట్ చేయించుకోవడం వెనక ధైర్యం ఎవరిదనే చర్చ నడుస్తోంది. సర్కారు పథకాలు సమర్థవంతంగా అమలు కావాల్సి న చోట అవినీతిక్రమంగా వ్యవస్థలా మారిపోతోందని ప్రజలు బాహాటంగానే మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
జిల్లాలో మూడు మండలాల ఎంపీఓలు..పంచాయతీ కార్యదర్శుల నుంచి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల పనితీరు, అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు తదితర వాటిపై పర్యవేక్షణ చేస్తూ..తప్పులను సరిదిద్దాల్సిన పలువురు ఎంపీఓలు..డబ్బులు డిమాండ్ చేస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నారు. అసలు బచ్చన్నపేట పంచాయతీ కార్యదర్శులు ఎంపీఓకు ఇచ్చిన డబ్బులు ఎక్కడివనే విషయం నిగ్గుతేలాల్సి ఉంది. గ్రామాల్లో పాలక మండలి పదవీకాలం ముగిసి, స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతున్న సమయంలో పరిపాలన బాధ్యత మొత్తం సెక్రటరీలపై పడింది. నల్లా రిపేరు నుంచి లైసెన్స్ జారీ వరకు పంచాయతీ కార్యదర్శిపైనే ఆధారపడి ఉంది. ఇందులో జరిగే చిన్న చిన్న తప్పులను ఎత్తిచూపిస్తూ..వాటిని సవరించాల్సిన పలువురు ఎంపీఓలు తమ చేతివాటం ప్రదర్శించడంపై దుమారం రేగుతోంది. బచ్చన్నపేట ఎంపీఓపై ఫిర్యాదు చేసి మూడు రోజులు గడిచిపోతున్నా, విచారణ లేకపోవడం గమనార్హం. జిల్లాలో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఏమీ కాదులే అన్న భరోసా కొంతమంది అధికారుల్లో ఉన్నట్టు ఈ విషయాన్ని బట్టి తెలుస్తోంది.
జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఓ మండల ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులను తన సొంత పనులకు టార్గెట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. బీమా పాలసీల పేరుతో ఒత్తిడి తెస్తున్నారని, అంగీకరించని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై పంచాయతీ ఉ న్నతాధికారులు అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. ఈ ఎంపీఓ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న బచ్చన్నపేట అధికారికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. బచ్చన్నపేట ఎంపీఓ బదిలీ అయిన తర్వాత, కొత్తగా అధికారి బాధ్యతలు తీసుకున్న వెంటనే సెక్రటరీల పనిపడుతామన్నట్లు సదరు ఎంపీఓ శపథం పూనినట్లు జిల్లా పంచాయతీ శాఖలో చర్చకు దారితీసింది. ఈ అధికారిపై కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు అక్కడి సెక్రటరీలు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఒకరిద్దరి ఒత్తిడితో వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
దందా ఎంపీఓలు!
దందా ఎంపీఓలు!
దందా ఎంపీఓలు!
దందా ఎంపీఓలు!


