బ్రిడ్జి మాకొద్దు
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయవద్దంటూ గ్రామస్తులు బుధవారం పనులను అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఛాగల్లులో జాతీయ రహదారిపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఇటీవల నిధులు మంజూరు కాగా నిర్మాణ పనులను చేసేందుకు సంబంధిత అఽధికారులు, కాంట్రాక్టర్ వర్కర్లతో ఈనెల 1న ఛాగల్లుకు రాగా అడ్డుకున్న విషయం విదితమే. అప్పుడు నాలుగు రోజులు గడువు అడుగగా పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా బుధవారం సదరు పనులను చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు పొక్లెయినర్‌తో అక్కడికి చేరుకోగా పలువురు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జితో ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా తాము నష్టపోతామని అక్కడ ఇళ్లు, స్థలాలు ఉన్న వారు అధికారులతో వాగ్వాదం చేశారు. అధికారులు మొదట సూచించిన ప్రదేశంలో కాకుండా మరో చోట నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించడంలో ఆంతర్యమేమిటంటూ అధికారులను నిలదీశారు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు, ఎస్‌ఐలు వినయ్‌కుమార్, రాజేశ్, మనీషా ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఈ దశలో పోలీసులకు, బాఽధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తారని, అడ్డుకోవడం సమంజసం కాదని, ఏమైనా సమస్య ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సీఐ ప్రజలకు సూచించారు. కాగా మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని బాఽధితులు కోరగా తాత్కాలికంగా పనులను నిలిపివేశారు. గ్రామస్తులు బాలగాని అనిల్‌గౌడ్, సయ్యద్ రహీమ్, సర్వర్, సాజిద్, రవి, కుమార్, అన్నెపు అనిల్, రాజేష్, అశోక్ పాల్గొన్నారు.
ఛాగల్లులో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పనులను అడ్డుకున్న గ్రామస్తులు
అధికారులు, పోలీసులతో వాగ్వాదం..
తాత్కాలికంగా పనుల నిలిపివేత


