భోజనం..మరింత రుచిగా
జనగామ రూరల్: చాలీచాలని ధరలతో వంట సరుకులను తెస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల అవస్థలు తీరడం లేదు. దీంతో ఎట్టకేలకు సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం వంట ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలను అమలుచేయాలని కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు సూచించింది. ధరలు పెరగడం వంట ఏజెన్సీ నిర్వాహకులకు కొంతమేర ఊరటనిచ్చింది. జిల్లావ్యాప్తంగా 503 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 35వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పెరిగిన ధరల ప్రకా రం విద్యార్థులకు మెరుగైన భోజనం అందించేందుకు అనుకూలంగా ఉంటుందని పలువురు వంట కార్మికులు తెలిపారు. అయితే వీటిని గతేడాది డిసెంబరు నుంచి అమలు చేయాల్సి ఉన్నందున అప్పటి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లిస్తుంది. ఈ మేరకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ఆహార నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన ఏజెన్సీలకు కొంతమేర కలిసివచ్చింది. వారంలో మూడు రోజులు విద్యార్థులకు కోడిగుడ్లు అందిస్తుండడంతో..వీటి పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 1091 మంది వంట కార్మికులు ఉన్నారు.
రేషన్‌షాపుల ద్వారా బియ్యం..
మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా బియ్యం అందజేస్తుండగా మిగతా సరకులు ఏజెన్సీలు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నాయి. వాటిని ప్రతి నెలా బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పలుమార్లు వీటి చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం జరగడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీని ప్రభావం భోజనం నాణ్యతపై పడుతోంది. ప్రస్తుతం పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించి, పిల్లలకు మంచి భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పెరిగిన గుడ్డు ధర ,కూరగాయల రేట్లు
సకాలంలో బిల్లులు రావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి వంటలు చేస్తున్నామని బిల్లులు మాత్రం సకాలంలో రావడం లేదని ఇలా అయితే తమ కుటుంబాలు గడిచేదేలా అని వారు వాపోతున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు కాయకూరలు తప్పనిసరి వండిపెట్టాలి. అయితే ప్రస్తుతం కూరగాయలు, పప్పు, చింతపండు, కారం, ఇతర సామగ్రితో పాటు, వంట గ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం చెల్లించే డబ్బులు సరిపోవడం లేదు. కాగా వారానికి మూడుసార్లు గుడ్డు పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు ధర విపరీతంగా పెరగగంతో ఆర్థికంగా భారం పడుతోందని చెబుతున్నారు.
రూ.12వేల వేతనం అందించాలి..
ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. నెలకు రూ.12,000లు చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. బిల్లులు సకాలంలో అందించాలి. గ్యాస్ సిలిండర్లను పూర్తి రాయితీపై పంపిణీ చేయాలి.
– రాపర్తి రాజు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ
11.79
ఉన్నత పాఠశాలలు (9–10)
ప్రాథమికోన్నత పాఠశాలలు (6–8)
ప్రాథమిక పాఠశాలలు (1–5)
మధ్యాహ్న భోజనం రేట్లను పెంచిన ప్రభుత్వం
వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఊరట
సకాలంలో బిల్లులు అందించాలని వినతి
జిల్లా వ్యాప్తంగా 503 పాఠశాలల్లో 35 వేలకుపైగా విద్యార్థులు
భోజనం..మరింత రుచిగా


