‘రుద్రమదేవి’ సొసైటీలో భారీ అవకతవకలు
జనగామ: పట్టణంలోని రుద్రమదేవి మహిళా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌లో జరిగిన భారీ ఆర్థిక అవకతవకలపై జిల్లా సహకార సొసైటీ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. రూ.7.09 కోట్ల నిధులను చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసినట్లు వరంగల్ కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఇటీవల తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోఆపరేటివ్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ మేరకు మంగళవారం జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్ కె.కోదండరాములు పట్టణ పోలీస్ స్టేషన్ స్టేషన్‌లో సీఐ సత్యనారాయణరెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా రిజిస్ట్రార్ కోదండరాములు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2018–2020 సంవత్సరాల్లో రుద్రమదేవి మహిళా మాక్స్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ, ఉద్యోగులు జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో 38.21 ఎకరాల భూమిని చట్ట వి రుద్ధంగా కొనుగోలు చేసి సొసైటీ నిధులను భారీగా దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఈ భూమి కొనుగోలు జనరల్ బాడీ ఆమోదం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొంది. యాజమాన్యం నిర్ధారణ లేకుండా భూమి కొనుగోలు చేయడంతో పాటు మధ్యవర్తులకు కమీషన్ పేరిట రూ.1.42 కోట్లు చెల్లించగా, ఇందులో రూ.90 లక్షలు నగదు రూపంలో నేరుగా చెల్లింపులు జరిగాయన్నారు. రికార్డులు తారుమారు చేసి, తప్పుడు నగదు పుస్తకాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో 22 మంది అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు ప్రధాన నిందితులుగా పేర్కొనబడ్డారు. వీరిలో సీఈఓ పి.కవిత, అధ్యక్షురాలు బండి విజయలక్ష్మి, సెక్రటరీ గడ్డం విజయలక్ష్మి, మాజీ సెక్రటరీ ఎం.పద్మ, క్లర్కులు గుండెల్లి శ్రీనివాస్, సుంకరి దేవేందర్, సలహాదారు తల్క లక్ష్మణ్, చిర్ర సుగుణమ్మ, మరో 14 మంది ఉన్నారు. వీరంతా మోసం, ఫోర్జరీ, కుట్ర, ఖాతాల తారుమారులో ప్రమేయం ఉన్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. సదరు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా అధికారి సీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని సీఐని కోరారు. అంతకుముందుగానే శాఖ పరంగా సొసైటీ రికార్డులు, బ్యాంకు, అమ్మకపు పత్రాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఏడాదికి 12 శాతం వడ్డీతో కలుపుకొని రూ.7.09 కోట్ల నిధుల రికవరీ కోసం వారి ఆస్తులను అటాచ్ చేసినట్లు చెప్పారు. సీఐతో పాటు డీసీపీకి సైతం ఫిర్యాదు కాపీలను పంపించినట్లు తెలిపారు. సహకార నిధుల దుర్వినియోగం కేసుల్లో ఇది అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రూ.7కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చిన ట్రిబ్యునల్
పోలీస్ స్టేషన్‌లో జిల్లా సహకార అధికారి ఫిర్యాదు


