ఎంసీహెచ్ అడ్డాగా..
జనగామ: పట్టణ వీధుల్లో కుక్కలదే రాజ్యం.. గుంపులుగా తిరుగుతూ బాటసారులు, ద్విచక్ర వాహనదారులపై విరుచుకు పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు వీటి బారిన పడి గాయపడ్డ ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్కారు సూచనల మేరకు పట్టణ పురపాలిక అధికారులు నియంత్రణ చర్యలు మొదలుపెట్టారు. పట్టణంలోని చంపక్ హిల్స్ డంపింగ్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) సెంటర్‌లో త్వరలోనే కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెలలో ఇప్పటివరకే 113 మందికి పైగా కుక్క కాటుకు గురయ్యారు. ఈ చర్యల ద్వారా వీధి కుక్కల జనన సంఖ్యను తగ్గించి ప్రజల్లో భయాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనగామ పట్టణంలో దాదాపు 1,480 కుక్కలు ఉండగా, మునిపిపల్, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా కుక్కలను పట్టుకుని కు.ని. ఆపరేషన్ చేసేందుకు సన్నద్ధమవు తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి పరిశీలన కథనం..
‘రండి ఎవరెవస్తారో చూస్తాం.. మమ్మల్ని దాటి వెళ్లగలిగే దమ్ము ఉందా...ఒక్క అరుపు చేస్తే గుండె దడతో ఆగిపోతారు..’ అన్నట్టుగా జనగామ చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లోనికి వెళ్లే ప్రధాన దారిలో కుక్కలు కూర్చున్నాయి. ఈ ఆస్పత్రికి ప్రసూతికి కాన్పులతో పాటు వైద్య పరీక్షల కోసం పిల్లలను ఇక్కడకు తీసుకొస్తారు. అలాగే వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు ఏరియా, చిన్నగేటు ప్రాంతం స్వర్ణకళామందిర్ ఏరియా జంక్షన్‌లో కుక్కలకు అడ్డాగా మారాయి. గల్లీ నుంచి బయటకు వెళ్లాలంటే కాలనీ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. లేని పక్షంలో చేతిలో కర్ర లేదా, రాయి పట్టుకుంటే తప్ప..వాటిని దాటి వెళ్లలేని పరిస్థితి.
రెండు రోజుల్లో కు.ని ఆపరేషన్లు
జనగామ చంపక్‌హిల్స్ డంపింగ్ యార్డు ఏరియాలోని ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) సెంటర్‌లో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. రెండ్రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. పట్టణంలో 1,480 కుక్కలు ఉన్నట్లు లెక్కల ద్వారా నిర్ధారించాం. కు.ని. ఆపరేషన్ల కోసం రూ.5లక్షల బడ్జెట్ అవనసరమున్నట్లు అంచనా వేశాం. సర్జరీ మెటీరియల్, రిఫ్రిజిరేటర్, స్టోరేజీ పాయింట్, ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేశాం. పశుసంవర్ధక శాఖ వైద్యుల సహకారంతో ముందుకెళ్తాం. కుక్కలు పట్టుకునే వారిని సైతం పిలిపించాం. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా కుక్కలు పట్టుకుని ఆపరేషన్ చేసిన వారం తర్వాత తిరిగి అక్కడే వదిలేస్తాం. – సత్యనారాయణరెడ్డి, మునిసిపల్ కమిషనర్
ఎంసీహెచ్ అడ్డాగా..


