మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి
● వ్యాపారులతో సమావేశంలో కమిషనర్ రాధాకృష్ణ
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించి స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో వివిధ రంగాల వ్యాపారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న గ్రామ పంచాయతీకి, ప్రస్తుత మున్సిపాలిటీకి ట్రేడ్ లైసెన్స్‌ల విషయంలో తేడా ఉంటుందని వ్యాపారులు గుర్తించాలన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది వేతనాలు రెట్టింపు అయ్యాయని, ఆ దిశగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను నిర్ణయించినట్లు తెలిపారు. సింగిల్‌లేన్‌లో ఉన్న షాపులకు చదరపు అడుగుకు రూ.3, డబుల్‌లేన్‌లో ఉన్న వాటికి రూ.6, మల్టిపుల్ లేన్‌కు రూ.9, స్టార్ హోట ళ్ళు, కార్పోరేట్ హాస్పిటళ్లకు రూ.11 చొప్పున నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, వ్యాపారులకు ఏడాది పాటు అవకాశం ఇవ్వాలని, లైసెన్స్ ఫీజుల ను ఏడాదికి రూ.10వేలు మించకుండా పరిమితంగా ఉంచాలని వ్యాపారులు, మిల్లర్లు జొన్నల రాజేశ్వరరావు, గోలి రాజశేఖర్, యంజాల ప్రభాకర్ ఈసందర్భంగా కోరారు. జనగామ, వర్ధన్నపేట తదితర మున్సిపాలిటీలలోనూ ఇంతగా ఫీజులు లేవని, అఽధికారులు వ్యాపారుల పక్షాన సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే శ్రీహరిని కలిసి తమ సమస్యల్ని విన్నవిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, సుమలత, మిల్లర్లు, ఫంక్షన్‌హాల్‌లు, పెట్రోల్‌బంక్‌ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.


