సంప్రదాయ కళారూపాలను ఆధునీకరించాలి
● ఆచార్య జయదీర్ తిరుమలరావు
జనగామ: ప్రాచీన కళా సంస్కృతి పునాదిపై ఆధునిక దేశీయ కళ అభివృద్ధి చెందాలని ఆచార్య జయదీర్ తిరుమలరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయంలో జరిగిన చెక్క బొమ్మలు, యక్ష గాన ప్రదర్శన, డాక్యుమెంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్మెట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కళాకారులు చెక్క బొమ్మల ప్రదర్శనకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. వేషధారణ, మేకప్, సంగీతం, దేశీయ నృత్యరీతులతో చెంచిత కథను సీ్త్ర, పురుషులు సమష్టిగా ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా కళాకారుల బృందం దేశంలోనే తొలిసారిగా చెక్క బొమ్మల ప్రదర్శనకు ముందుకు రావడం విశేషమని వక్తలు కొనియాడారు. అనంతరం జయదీర్ తిరుమలరావుతో పాటు వక్తలు మాట్లాడుతూ కళారూపాలపై విద్యార్థులు చూపించిన ఆసక్తి ప్రశంసనీయమని, సంప్రదాయ కళలను బతికించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఆచార్య గూడూరు మనోజ్, మెట్టు వెంకటనారాయణ, మోతె కనకయ్య, మీనయ్య తదితరులు పాల్గొన్నారు.
సంప్రదాయ కళారూపాలను ఆధునీకరించాలి


