జనగామ మార్కెట్‌కు మినీ ప్యాడీ డ్రయర్
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో రూ.13.50 లక్షల వ్యయంతో కొత్త మినీ ప్యాడీ డ్రయర్ (ధాన్యం ఆరబెట్టే యంత్రం)ను ఏర్పాటు చేశారు. వారంరోజుల క్రితమే ఈ యంత్రం మార్కెట్ యార్డుకు చేరుకున్నప్పటికీ, నేటికీ ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ బడ్జెట్ నుంచి డ్రయర్ నిర్వహణకు కావాల్సిన డబ్బులు సమకూర్చాలనే ఆలోచనపై అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండున్నర టన్నులు.. గంటన్నర సమయం
రెండున్నర టన్నుల సామర్థ్యం కలిగిన ఈ మినీ ప్యాడీ డ్రయర్ సుమారు 30 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని 17 శాతానికి తగ్గించడానికి గంటన్నర సమయం తీసుకుంటుంది. దీనికి సుమారు 11 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. ఈ ఖర్చును రైతులే భరించాలన్న నిర్ణయం రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ప్యాడీ డ్రయర్‌ను మార్కెట్ కమిటీ ఖర్చులతో నడపాలా? లేక రైతులపై భారం వేయాలా? అనే ప్రశ్నలు తలెత్తుతుండగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో మినీ ప్యాడీ డ్రయర్‌లను కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్‌లకు పంపించారు. మార్కెట్ బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సివిల్ సప్లయీస్ శాఖ, డ్రయర్ సేవల సమయంలో డీజిల్ ఖర్చు ఎవరు భరించాలనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ భారమంతా రైతులపై పడే అవకాశం ఉంది. 11 లీటర్లకు సుమారు రూ.1,100 వరకు ఖర్చు చేసే సమయంలో రైతులు ముందుకు వస్తారా...లేదా.. అనే సందిగ్ధం నేపధ్యంలో డ్రయర్ సేవలు ఎలా ముందుకు అనే విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
సివిల్ సప్లయీస్ శాఖ నుంచి మినీ ప్యాడీ డ్రయర్ కొనుగోలు చేసి తమకు పంపించారు. డబ్బులు మార్కెట్ నుంచి చెల్లించాలని చెప్పారు. రెండున్నర టన్నుల ధాన్యం సామర్థ్యం కలిగిన ఈ యంత్రం గంటన్నర సమయంలో 30 శాతం ఉన్న సరుకు నుంచి 17 శాతానికి తీసుకువస్తుంది. ఇందుకు 11 లీటర్ల వరకు డీజిల్ ఖర్చు అవుతుందని ప్రాథమిక సమాచారం. డీజిల్ డబ్బులు ఎవరు భరించాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావాలి. ప్రస్తుతం రైతులే భరించుకోవాలి.
– జీవన్ కుమార్, మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి
నిర్వహణ ఖర్చులపై
స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ఏఎంసీ భరిస్తుందా.. రైతులు భరించాలా!
అయోమయంలో అన్నదాతలు
నేటికీ ప్రారంభం కాని సేవలు


