సీసీఐని సద్వినియోగం చేసుకోండి
● స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిల్పూరు: పత్తి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మండలంలోని రాజవరం గ్రామశివారులో ఉన్న సిరి కాటన్ మిల్లులో సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్డీఓ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పత్తి క్వింటాలుకు రూ.8,110ల మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేస్తుందని, ఎలాంటి దళారుల బెడద లేకుండా రైతులు నేరుగా అమ్మకాలు చేయవచ్చని అన్నారు.
కడియం దృష్టికి కపాస్ ఇక్కట్లు..
కపాస్ కిసాన్ యాప్‌తో ఇబ్బందులు ఉన్నాయంటూ ధర్మసాగర్, వేలేరు మండల రైతులు కడియం శ్రీహరి దృష్టికి తెచ్చారు. యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే పరకాల కాటన్ మిల్లు చూపిస్తోందని, అంత దూరం తీసుక పోతే ఖర్చులు ఎక్కువ అవుతాయంటూ తెలిపారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యరెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ మధుసూదన్, ఏఓ నజీరుద్దీన్, నాయకులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీ పోస్టులకు 6న ఇంటర్వ్యూ
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పలు కాంట్రాక్టు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ తేదీని 5 నుంచి 6వ తేదీకి మార్చినట్లు ప్రిన్సిపాల్ నాగమణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, కాంట్రాక్ట్ బేసిస్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వచ్చే నెల 5న ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు తొలుత నిర్ణయించారు. అయితే ఆ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండడంతో 6వ తేదీకి మార్చినట్లు ఆమె పేర్కొన్నారు.


