పట్టించుకునేవారేరి ?
జనగామ రూరల్: ఏళ్ల తరబడి తిరుగుతున్నా దివ్యాంగ పింఛన్ రావడం లేదని ఓ బాధితుడు..కుమారులు తమను చూసుకోవడం లేదని ఓ తల్లిదండ్రులు.. జిల్లాలో రిజర్వాయర్‌లను పూర్తిచేసి ఆదుకోవాలని రైతులు.. ఇందిరమ్మ బిల్లు రావడం లేదని లబ్ధిదారులు..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌కు జనాలు తరలివచ్చారు. ఈసందర్భంగా వారి నుంచి అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, జిల్లా అధికారులు 71 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ట్రైనింగ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తేజస్విని, ఆర్డీఓ గోపిరామ్, డీఆర్డీఓ వసంత, కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు కొన్ని ఇలా..
● జనగామలో నివసిస్తున్న గాడిపల్లి దయానందరెడ్డికి చెందిన భూమి రెవెన్యూ రికార్డులో తక్కువగా నమోదు అయ్యిందని, సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
● బచ్చన్నపేటకు చెందిన మార్క్ కిషన్ తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కొంతమంది ఆక్రమించుకొని ఇల్లు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని, విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
● బచ్చన్నపేట గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయస్సు గల అహ్మద్ బాబా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరారు.
దరఖాస్తుల వివరాలు
డీపీఓ 12, హౌజింగ్ పీడీ 14, తహసీల్దార్ పరిధిలో 28, విద్యాశాఖ 2, విద్యుత్ 3, ఇరిగేషన్ 2, మున్సిపల్ 2, ఆర్డీఓ, డీపీఓ, డీఆర్‌డీఏ, లేబర్ అధికారి ఒకటి చొప్పున వచ్చాయి.
ఏళ్ల తరబడిగా తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు
గ్రీవెన్స్‌లో ప్రజల మొర..71 దరఖాస్తులు
త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశం


