‘చింపాంజీ’ కదిలే.. కోతులు బెదిరే
కోతుల బెడద తప్పించేందుకే..
● చింపాంజీ వేషధారణతో వాడవాడకూ సిబ్బంది
● బతుకమ్మ కుంటలో ప్రయోగాత్మక ప్రారంభం
● ఇక వానరమూక ఆటకట్టు..
● సత్ఫలితాలు వస్తే ప్రజలకు పెద్ద ఊరట
జనగామ: కోతుల ఆగడాలతో విసిగిపోతున్న ప్రజలకు కొంచెం రిలీఫ్ దొరికే సమయం వచ్చింది. జనగామ మున్సిపల్ అధికారులు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. కోతుల భయాన్ని పారదోలేది కోతులే అన్నట్టు శానిటేషన్ కార్మికులకు బ్లాక్ కలర్ చింపాజీ డ్రస్‌ల్లో రంగంలోకి దింపి మిషన్ స్టార్ట్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పురపాలక అధికారులు ఇటీవల విజయవంతంగా అ మలు చేసిన చింపాంజీ డ్రస్ మిషన్‌ను ఆదర్శంగా తీసుకుని, పట్టణంలో కూడా అమలు చేస్తున్నారు.
వినూత్న విధానం..
జనగామ పట్టణంలో జనాభాతో పోటీ పడుతూ రోజురోజుకూ కోతుల సంతతి పెరుగుతోంది. ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. నెలలో పదుల సంఖ్యలో కోతులు కరిచి ఆస్పత్రి పాలవుతున్నారు. కోతల నుంచి రక్షణ కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇస్తున్నారు. వానరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి సారథ్యంలో శనివారం నుంచి కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బ్లాక్ కలర్ చింపాంజీ డ్రస్సులను ఆరుగురు శానిటేషన్ కార్మికులకు వేసి..కోతులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో దింపారు. ఆ డ్రస్సుల్లో కార్మికులు కనిపించగానే, కోతులు భయపడడం మొదటి రోజు కనిపించింది. మొదటగా బతుకమ్మ కుంట పరిసరాల్లో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. చింపాంజీ వేషధారణలో ఉన్న కార్మికుడు చుట్టూ తిరగడం ప్రారంభించగానే కొంతసేపు అక్కడ తిరిగే కోతులు ఒక్కసారిగా చెట్లెక్కి దూరంగా వెళ్లిపోయాయి. ఈ దృశ్యం చూసి స్థానికులు హమ్మయ్య అంటూ రిలాక్స్ అ య్యారు. జనగామలో ఈ కొత్త ప్రయోగం ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కోతులకు చెక్ పెట్టే ఈ వినూత్న ప్రయత్నం భవిష్యత్తులో సత్ఫలితాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే..ఆరుగురి స్థానంలో మరికొంత మందిని పెంచే విధంగా అధికారులు ముందుకు వెళ్ల నున్నారు. చింపాజీ డ్రస్సుల్లో ఉన్న కార్మికులకు భద్రతగా మరికొంత మంది అక్కడే నిఘా వేసి ఉంటారు.
ప్రజలకు కోతులతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఇదొక ప్రయత్నం. యాదగిరిగుట్టలో సక్సెస్ అయిన విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నాం. ఆన్‌న్‌లైన్ ద్వారా ప్రత్యేకంగా ఆరు చింపాంజీ డ్రస్సులు కొనుగోలు చేశాం. కార్మికుల భద్రత కోసం వారి వెంట మరి కొంతమంది శానిటేషన్ సిబ్బంది కూడా ఉంటారు.
– మహేశ్వర్‌రెడ్డి,
మునిసిపల్ కమిషనర్, జనగామ
‘చింపాంజీ’ కదిలే.. కోతులు బెదిరే


