అతలాకుతలం
మండలాల వారీగా..
జిల్లాలో వర్షపాతం వివరాలు
– మరిన్ని ఫొటోలు 9లోu
జనగామపై పంజా విసురుతున్న మోంథా తుపాను
జనగామ:గ్రెయిన్ మార్కెట్ రూట్ కల్వర్టు వద్ద ఇళ్లలోకి చేరిన వరద నీరు
జనగామ: మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మురికి కాల్వలు, ఎగువ ప్రాంతం నుంచి దూసుకువస్తున్న వరద నీటితో జనగామ పట్టణంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్ ప్రధా న రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్టీసీ చౌరస్తా వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో డీసీపీ రాజమహేంద్ర నాయ క్, అదనపు కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓల పర్యవేక్షణలో మోంథా ప్రభావంపై అలర్ట్‌గా ఉన్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో కల్వర్టులపై వరద ప్రవాహం పెరగడంతో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లగా, ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పినా, పూర్తిగా తడిసి పోయాయి.
హైదరాబాద్ రోడ్డుపై..
జనగామ పట్టణం హైదరాబాద్ రోడ్డుపై వరద నడుము లోతు వరకు పెరగడంతో రాకపోకలను నిలిపి వేశారు. కలెక్టర్ పరిస్థితిని సమీక్షించగా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షించారు. శానిటేషన్ కార్మికులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించారు. లోతట్టు ప్రాంతాలైన శ్రీనగర్, జ్యోతినగర్, బాలాజీనగర్ కాలనీలను వరద ముంచెత్తింది. గ్రెయిన్ మార్కెట్ ప్రధాన రహదారి కల్వర్టుపై వరద నీరు అంతకంతకు పెరిగి పోతుండడంతో చీటకోడూరు, వీవర్స్ కాలనీ, చౌడారం, తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలి చి పోగా, కృష్ణ, మల్లేశం, చంద్రయ్య, యాదగిరి, సూర్యనారాయణ ఇళ్లు నీటమునిగాయి. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు వరద నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గానుపహాడ్ కల్వర్టు కొట్టుకుపోవడంతో ఆ మార్గాన్ని మూసివేసి, వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు.
పత్తి, వరి పంటకు నష్టం
భారీ వర్షాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జనగా మ మార్కెట్‌లోని కాటన్ యార్డు, ఐకేపీ, పీఏసీ ఎస్ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధా న్యం తడిసిపోకుండా అధికారులు టార్పాలిన్ కవర్లతో కప్పినా తేమ శాతం పెరగడంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. వందలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా జిల్లాలో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
విద్యార్థులకు ఇబ్బందులు
ఉదయం పాఠశాలల సమయం తర్వాత ఒక్కసారిగా వర్షం ముంచెత్తడంతో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి చేరే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ రోడ్డులోని ఏకశిల పబ్లిక్ స్కూల్ ఏరియాలో ఒక్కసారిగా వరద నీరు పెరిగి పోవడంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకు వెళ్లే సమయంలో నరక యాతన పడ్డారు.
నిండిన చెరువులు..రిజర్వాయర్లు
జిల్లాలో 770 చెరువులు ఉండగా, 303 చోట్ల మత్తడి పోస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో 75 నుంచి 100శాతం 401, 50 నుంచి75 శాతం 145, 25 నుంచి 50శాతం 66, 25 శాతం మేర 40 చెరువులకు వరద నీరు చేరడంతో జళ కళ సంతరించుకుంది. చీటకోడూరు, నవాబుపేట రిజార్వాయర్లు వందశాతం నిండగా, గండిరామవరం 81.38, బొమ్మకూరు 85.99, కన్నె బోయినగూడెం 80.41చ అశ్వరావుపల్లి 79.19, ఆర్‌ఎస్ ఘన్‌పూర్ 77.07 శాతం మేర నీటి నిల్వలు పెరిగాయి.
ఆటోలో వెళ్తున్న పాఠశాల విద్యార్థులు
బైక్‌పై పిల్లలను తీసుకెళ్తున్న కుటుంబ సభ్యుడు
పత్తి, వరి పంటకు తీవ్ర నష్టం
ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో తడిసిన ధాన్యం
పొంగి పొర్లుతున్న వాగులు.. మత్తళ్లు దూకుతున్న చెరువులు
హైదరాబాద్ రోడ్డు జలమయం
గ్రెయిన్ మార్కెట్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు
నిలిచిపోయిన రాకపోకలు
కలెక్టర్, పోలీసులు పర్యవేక్షణలో రక్షణ చర్యలు
జిల్లాలో 16 సెంటీమీటర్ల వర్షపాతం
స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ పరిధిలోని 15, 16వ వార్డుల ఎస్సీ కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో నీటిని తొలగించారు.
పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఓ మహిళ ఇల్లు నీటమునిగి, శిథిలావస్థకు చేరడంతో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు బాధితురాలు మెసేజ్ పంపగా, వెంటనే స్పందించిన కలెక్టర్ అధికారులను పురమాయించారు. వారు ఆ మహిళను ప్రైమరీ స్కూల్‌కు తరలించి సాయం అందించారు. పాలకుర్తి మండల కేంద్రంలో పలు ఇళ్లలోని నీరు చేరింది.
జనగామ మండలం చీటకోడూరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామపంచాయతీ సిబ్బంది, పోలీసులు వాగు పక్కన కాపలా కాస్తున్నారు. చీటకోడూరు రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విదుల చేశారు.
వరంగల్ ప్రధాన రహదారి రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ సమీపంలో వరదకు ఓ కారు ఎగిరి పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ఇద్దరికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
మండలం వర్షపాతం
(మిల్లీ మీటర్లలో)
పాలకుర్తి 273.8
జఫర్‌గఢ్ 256.5
చిల్పూరు 257.0
నర్మెట 217.3
స్టేషన్‌ఘన్‌పూర్ 207.0
తరిగొప్పుల 178.3
దేవరుప్పుల 168.3
రఘునాథపల్లి 149.5
లింగాలఘణపురం 133.3
బచ్చన్నపేట 133.0
కొడకండ్ల 125.0
జనగామ 121.0
అతలాకుతలం


