జాతీయ రహదారిపై వాగు ఉధృతి
● వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
రఘునాథపల్లి: హనుమకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట రహదారిపై ప్రవహిస్తున్న వాగులో ఓ ఆర్టీసీ బస్సు చిక్కుకున్న సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో హన్మకొండకు వెళ్తుంది. ఖిలాషాపూర్ పటేల్ చెరువు అలుగు ఉధృతితో జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాగులో నుంచి దాటే క్రమంలో మధ్యలో బస్సు మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్ సిబ్బందితో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు కోమళ్ల టోల్ ప్లాజా, నిడిగొండ వద్ద వాహనాలు నిలిపేశారు. మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, స్థానికులు జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లకుండా వర్షంలోనే సేవలు అందించారు. వాగులో మొరాయించిన ఆర్టీసీ బస్సును జేసీబీతో బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
జాతీయ రహదారిపై వాగు ఉధృతి


