అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జనగామ: జిల్లాకు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన పనులపై అదనపు కలెక్టర్లు, డీసీపీ, ఆర్డీఓలు, ఏఎస్పీ, ఏసీపీలు, మున్సి పల్ కమిషనర్లు, అన్ని శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాలతో ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలన్నారు. లో లెవల్ కాజ్ వేల వద్ద అధికారులు అలర్టుగా ఉండాలన్నారు. చెరువులు, వాగులు, రిజర్వాయర్ల వద్ద రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు వాటర్ లెవల్ మానిటరింగ్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల పరిధిలో లోతట్టు ప్రాంతాలు, నాలాల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. వైద్యులు, వైద్యాధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలన్నారు. వచ్చే రెండు రోజుల వరకు ఎవరికి సెలవులు లేవ ని, ప్రతి అధికారి అందుబాటులో ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం (90523 08621) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర పింకేష్ కుమార్ సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు.
రఘునాథపల్లి: భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం జనగామ డీసీపీతో కలిసి మండల కేంద్రంలోని ఆర్‌వీఎస్ వద్ద జాతీయ రహదారిపై నిలిచిన వర్షపు నీరును పరిశీలించారు. మండలంలో వరదల పరిస్థితిపై సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై డి.నరేష్‌ను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలి
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
అధికారులు అప్రమత్తంగా ఉండాలి


