బాబోయ్..ఎలుగుబంట్లు
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని తాటికొండ గ్రామశివారులో రాత్రివేళల్లో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాటికొండ నుంచి గిద్దెబండాకు వెళ్తున్న దారిలో శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులకు బోళ్ళబండ వద్ద రెండు ఎలుగుబంట్లు రోడ్డుపై వెళ్తూ కనిపించగా ఒక్కసారిగా వణికిపోయారు. కాగా వారి బైక్ లైట్ వెలుగుకు బెదిరి అవి రోడ్డుపై పరుగెడుతుండగా యువకులు తమ సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీసి తాటికొండ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అయితే తాటికొండ శివారులోని గుట్టల ప్రాంతం నుంచి ఎలుగుబంట్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. తాటికొండ గ్రామ శివారులోని రోడ్లపై ఎలుగుబంట్లు సంచరిస్తున్న సమాచారంతో ప్రజలు, అటువైపు వ్యవసాయ భూములు ఉన్న రైతులు భయపడుతున్నారు. రాత్రి వేళల్లో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచనలు చేస్తున్నారు.
తాటికొండ గ్రామశివారుల్లో సంచారం
భయాందోళనలో ప్రజలు


