ఉద్యమాలను ఉధృతం చేయాలి
జనగామ రూరల్: రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని, సీసీఐని నీరు కార్చేందుకే కపాస్ కిసాన్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఓ పంక్షన్‌హాల్‌లో తెలంగాణ పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి నాథన్ సిఫారుసుల మేరకు పత్తికి గిట్టుబాటు ధర రూ.10,075 అమలు చేయాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. దేశంలో పండించిన పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతువ్యతిరేక విధానాలను విరమించుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్లు మూఢ్ శోభన్, భూక్యా చందు నాయక్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, మంగ బీరయ్య, చిలుకూరి రాము, వాంకుడోత్ కోబల్, కనకాచారి, రామన్న, బాల్‌రెడ్డి, ఎర్రనాయక్, షేక్ సైదా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా కిసాన్ సభ
కేంద్ర కమిటీ సభ్యుడు రంగారెడ్డి


