ఆసుపత్రిలో ఓపీ పెంచాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీలను, సాధారణ ప్రసవాలను పెంచాలని, అందుకుగానూ వైద్యులు సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ కె.మల్లికార్జున్‌రావు ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అలాగే ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన వ్యాధులపై నిర్లక్ష్యం చేయకూడదని, ఆయా గ్రామాల ఆశాల ద్వారా ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు ప్రసన్నకృష్ణ, క్రాంతి స్వరూప్, ఫార్మాసిస్ట్ బొడ్డు శ్రీనివాస్, సూపర్‌వైజర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
జనగామ రూరల్: స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వివిధ రకాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్స్ (4) పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్స్ (12) పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (13) పోస్టులు, కాంట్రాక్ట్ బేసిస్ సీనియర్ రెసిడెంట్ (23) పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 5వ తేదీన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, చంపక్‌హిల్స్ మాతాశిశు సంరక్షణ కేంద్రం కార్యాలయం 2వ అంతస్తు లోని ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఉదయం 10:00 నుంచి 11:00 వరకు అందజేయాలని చెప్పారు. ఆదే రోజు ఉదయం 11: 00 గంటల నుంచి 4:00 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుందని ఆయా కేటగిరీకి సంబంధించిన దరఖాస్తులు www. gmc. jangaon వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని అర్హతా సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.
జనగామ రూరల్: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ –17 విభాగంలో వాలీబాల్ పోటీల్లో మండలంలోని పెంబర్తి గ్రామంలోని ఎంజేపీలోని పదో తరగతి విద్యార్థి కాలేరు రాంచరణ్ ప్రతిభ చూపి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈనెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని పటాన్ చెరువు మైత్రి మినీ స్టేడియంలో ఉమ్మడి వరంగల్ జట్టు తరఫున వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈమేరకు గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు.
లింగాలఘణపురం: మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే రాష్ట్రీయ ఏకతా దివస్‌లో ప్రదర్శన ఇవ్వడానికి జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు వెళ్లినట్లు ఉస్తాద్ ఒగ్గు రవి తెలిపారు. ఒగ్గుడోలు కళాప్రదర్శనకు భారత ప్రభుత్వం పక్షాన చండీశ్వర ఒగ్గుసేవా సమితికి ఆహ్వానం అందినట్లు, దీంతో కళాకారులు చౌదరిపల్లి ఉపేందర్, మరికుక్కల అశోక్, చౌదరిపల్లి ప్రశాంత్‌ను పంపినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహరెడ్డి ప్రోత్సాహంతో ఒగ్గు కళాకారులు గుజరాత్‌కు బయలుదేరినట్లు చెప్పారు.
ఆసుపత్రిలో ఓపీ పెంచాలి
ఆసుపత్రిలో ఓపీ పెంచాలి


