సైబర్, డ్రగ్స్ నేరాలపై దృష్టిసారించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. గురువారం డివిజన్ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని ఫైళ్లు, రిజిష్టర్లను పరిశీలించారు. ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. పెండింగ్ కేసులు, మండల పరిధిలో శాంతిభద్రతలు తదితర అంశాలపై ఎస్‌హెచ్‌ఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదు అవుతున్నాయి.. స్టేషన్ పరిధిలో ఎన్ని సెక్టార్లు ఉన్నాయి, సెక్టార్ల వారీగా ఎస్‌ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీషీటర్లు, అనుమానితులు, వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. అదేవిధంగా స్టేషన్‌వారీగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరుతో పాటు వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీషీటర్ ఇళ్లను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘన్‌పూర్ పట్టణ పరిధిలో పోలీస్ పెట్రోలింగ్‌ను నిరంతరం నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏపీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు, ఎస్‌ఐ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్ సందర్శనలో
సీపీ సన్‌ప్రీత్‌సింగ్
సైబర్, డ్రగ్స్ నేరాలపై దృష్టిసారించాలి


