పత్తి రైతుకు చిల్లర దగా | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు చిల్లర దగా

Oct 23 2025 6:41 AM | Updated on Oct 23 2025 6:43 AM

పత్తి రైతుకు చిల్లర దగా

జోరుగా చిల్లర కాంటాలు

జిల్లాలో పుట్టగొడుగుల్లా చిల్లర కాంటాలు

జిల్లాలో జోరుగా పత్తి సేకరణ

జనగామ: జిల్లాలో పత్తి సేకరణ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం పత్తి రైతులను నిండా ముంచుతోంది. పత్తిని సేకరించి విక్రయానికి సిద్ధం చేసిన రైతులు సీసీఐ రాక కోసం ఎదురుచూస్తుండగా..అప్పులు తీర్చాల్సిన మరికొంత మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువకు అమ్ముకుంటున్నారు. దీంతో జిల్లాలోని అనేక మండలాల పరిధిలో చిల్లర కాంటాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తూ రైతులను పీల్చి పిప్పిచేస్తున్నారు.

జిల్లాలో వానాకాలం సీజన్‌లో సుమారు 1.25లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అతి, అనావృష్టితో పత్తి దిగుబడి 30శాతం తగ్గిపోయింది. గత రెండు నెలలుగా అడపదడపా వర్షాలు కురుస్తుండడంతో పత్తి రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఉన్న పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో నెల రోజుల నుంచి తెల్లబంగారం సేకరణ ప్రారంభించారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సీసీఐ సెంటర్లను ప్రారంభించాలని రెండు వారాలుగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 15 సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలస్యం కావడంతో కొనుగోలు ప్రక్రియ నేటికీ ప్రారంభం కాలేదు.

కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా పారదర్శకత

ఈసారి పత్తి కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీసీఐ శ్రీకపాస్‌ కిసాన్‌ యాప్‌శ్రీను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు తమ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ముందుగానే దీని ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. తాము బుక్‌ చేసుకున్న స్లాట్‌ సమయానికి అనుగుణంగా 24 గంటల్లో సీసీఐ సెంటర్‌కు రావాల్సి ఉంటుంది. వారం రోజులకు సంబంధించిన స్లాట్లను ఒకేసారి విడుదల చేయనున్నారు. స్లాట్‌ రద్దు చేయాలంటే కూడా 24 గంటల ముందుగానే క్యాన్సిల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

తేమ శాతంపై ఆధారపడి ధర నిర్ణయం

సీసీఐ సెంటర్లలో 8 శాతం తేమ కలిగిన పత్తికి క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధర చెల్లించనున్నారు. 12 శాతం వరకు తేమ ఉన్న పత్తికి క్వింటాల్‌కు ఒక్కో శాతానికి రూ.81.10 చొప్పున తగ్గింపుతో చివర రూ.7,785.60లకు కొనుగోలు చేస్తారు. రైతులు నష్టపోకుండా, దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలంటే వెంటనే సీసీఐ సెంటర్లను ప్రారంభించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సకాలంలో ప్రారంభించాలన్నారు.

సీసీఐ సెంటర్లు ప్రారంభం కాకపోవడంతో జిల్లావ్యాప్తంగా చిల్లర కాంటా వ్యాపారాలు ఎక్కడ పడితే అక్కడ పుట్టుకొస్తున్నాయి. వీటిని కొంతమంది దళారులు నడుపుతూ రైతుల్ని మోసం చేస్తున్నారు. చిల్లర కాంటాల వద్ద పత్తి క్వింటాల్‌ రూ.5,800 నుంచి రూ.7,000 వరకు మాత్రమే ధర పలుకుతోంది. సీసీఐ సెంటర్లు లేక రైతులు విధి లేని పరిస్థితుల్లో క్వింటాల్‌ పత్తికి రూ.2,300 నుంచి రూ.1,200 తక్కువకు అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేట్‌ కొనుగోళ్ల ద్వారా సేకరించిన పత్తిని బినామీ రైతుల పేర్లతో సీసీఐ సెంటర్లకు తరలించేందుకు కొంతమంది దళారులు తెరవెనక కథ నడిపిస్తున్నట్లు సమాచారం. చిల్లర కాంటాలను అదుపు చేయాల్సిన అధికారులు మాత్రం గప్‌ చుప్‌గా ఉండిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.

మద్దతు ధర కంటే తక్కువకు అమ్మకాలు

దళారుల దందాతో పత్తి రైతుల కుదేలు

సీసీఐ కొనుగోలు కేంద్రాల కోసం

ఎదురుచూపులు

పత్తి రైతుకు చిల్లర దగా1
1/1

పత్తి రైతుకు చిల్లర దగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement