
మద్దతు ధరతో పాటే బోనస్
రఘునాథపల్లి: ఈ ఖరీఫ్ నుంచే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు మధ్దతు ధరతో పాటు బోనస్ కలిపి ఖాతాలో జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండలంలోని ఖిలాషాపూర్, మంగళిబండతండా, జాఫర్‌గూడెం, వెల్దిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు..కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంట వెంటనే మిల్లులకు పంపాలని నిర్వాహకులకు సూచించారు. రబీ సాగు రెండో పంట కోసం ప్రతీ ఎకరాకు గోదావరి జలాలు అందించే బాధ్యత తనదని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి టీ స్టాల్, ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్‌డీఓ గోపిరాం, డీఆర్డీఓ వసంత, డీఏఓ అంబికాసోని, తహసీల్దార్ ఫణికిషోర్, ఏడీఏ వసంత సుగుణ, ఏఓ కాకి శ్రీని వాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీశ్‌చందర్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
యుగంధర్ కుటుంబానికి పరామర్శ
మండలంలోని మండలగూడెం గ్రామానికి చెందిన గాదె యుగంధర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం పార్టీ నాయకులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను పరామర్శించారు.
జీడికల్ ఆలయంలో శాశ్వత ఏర్పాట్లు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి శాశ్వత ప్రాతిపదికన రూ.5 నుంచి రూ.10 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వచ్చే నెల 4 నుంచి 17వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగొద్దని 10న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గుండాల వరకు మెట్లు, గుండాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, జీడికల్ గ్రామం నుంచి ఆలయానికి వచ్చే రోడ్డుపై సీసీ వేయాలని, నిత్య కై ంకర్యానికి ఆలయ సమీపంలో పూలతోటలు పెంచాలన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పని చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆర్డీఓ గోపీరామ్‌ను స్పెషల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. సమీక్షలో డీపీఓ స్వరూప, డీసీపీ రాజమహేంద్రనాయక్, దేవస్థాన చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణమంతా కలియతిరిగి సమస్యలను గుర్తించి అధికారులకు సూచనలు చేశారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి