
విజయ డెయిరీదే అగ్రస్థానం
జనగామ రూరల్: పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పాల సేకరణలో జనగామ పాడి రైతుల కృషి అభినందనీయమని రాష్ట్రంలోనే పాల సేకరణలో విజయ డెయిరీదే అగ్రస్థానమని విజయ పాల డెయిరీ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని విజయ డెయిరీలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014లో విజయ డెయిరీ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు మన ప్రాంతంలో రైతుల నుంచి సేకరణ తక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం 4.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా అమ్మకాలు బాగా తగ్గాయని ముఖ్యమంత్రి చొరవతో ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో లక్ష లీటర్లు విక్రయిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా విజయ ఉత్పత్తులను విక్రయించేలా పాడి రైతులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో మాట్లాడే మొదటి అవకాశం వచ్చినప్పుడు తాను జనగామ పాల రైతుల కోసం మాత్రమే మాట్లాడానని గుర్తుచేశారు. అంతకుముందు మండలంలోని సిద్దెంకి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాడిరైతులకు ప్రోత్సాహకంగా బోనస్ కింద లక్ష రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో విజయ పాల డెయిరీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, జీఎమ్ మల్లయ్య, మధుసూదన్‌రావు, డీడీ గోపాల్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు ధర్మారెడ్డి, మేనేజర్‌లు హరికృష్ణ, లింగారెడ్డి, నరేశ్, పాడి రైతులు పాల్గొన్నారు.
పాలసేకరణలో జనగామ పాడి రైతుల కృషి అభినందనీయం
విజయ పాల డెయిరీ రాష్ట్ర చైర్మన్
గుత్తా అమిత్‌రెడ్డి
సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా