
ఊళ్లోనే యూరియా !
రైతుల కష్టాలు తీర్చేందుకు కలెక్టర్ ఆదేశాలు
జనగామ: రైతులకు యూరియా కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వ్యవసాయ పనులు వదులుకుని ఎరువుల దుకాణాలు, ఆగ్రోస్, పీఏసీఎస్, హాకా, ఓడీసీఎంఎస్ సెంటర్ల వద్ద బారులుదీరుతున్నారు. తెల్లవారి లేచింది మొదలుకుని మండల, జిల్లా కేంద్రాలకు వస్తూ ఒక్క బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు రవాణా సులభతరం చేస్తూ రైతువేదికలు, పీఏసీఎస్ సెంటర్లలో అదనపు యూరియా సెంటర్లను ప్రారంభించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి యూరియా విక్రయించే వారికి ఈ–పాస్ యంత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు.
రైతు ముంగిట్లో..
రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు యూరియా కోసం పట్టణాలు, జిల్లా కేంద్రానికి వచ్చి అవస్థలు పడకుండా పీఏసీఎస్, రైతువేదికల్లో తాత్కాలిక యూరియా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు సమయం, డబ్బు ఆదా అవ్వడంతో పాటు రవాణా భారం కూడా తగ్గనుంది. ఇప్పటివరకు యూరియా పంపిణీ ప్రధానంగా పట్టణాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమైంది. దీంతో రైతులు పొలాల్లో పనిచేసుకోవాల్సిన సమయంలో ఎరువుల కోసం దూరప్రాంతాలకు రావాల్సి వచ్చేది. రైతుల కష్టాన్ని గమనించిన కలెక్టర్, స్థానికంగా యూరియా అదనపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. యూరియా పంపిణీ బాధ్యత వహించే సిబ్బందికి ఈ–పాస్ యంత్రాల ఉపయోగంపై శిక్షణ ఇచ్చారు. రైతులకు సక్రమంగా ఎరువులు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. రైతులు తమ గ్రామాలకు కేటాయించిన రైతువేదికలు, పీఏసీఎస్ అదనపు విక్రయ కేంద్రాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఆధార్–పంట నమోదు పత్రాలు తప్పనిసరి
యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు ఆధార్ కార్డుతో పాటు పంట నమోదు పత్రాలు వెంట తెచ్చుకోవాలి. దీంతో అర్హులైన వారికి మాత్రమే ఎరువులు చేరతాయి. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, మోసపూరిత లా వాదేవీలకు అవకాశం ఇవ్వబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఎవరు అక్రమ నిల్వలు చేసుకున్నా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికంగా యూరియా వినియోగిస్తే పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని, శాసీ్త్రయ పద్ధతుల్లో యూరియాను వాడుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
5,520 టన్నుల కేటాయింపు
జిల్లాలో ఈనెలలో 5,520 టన్నుల యూరియా అవసరమున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం 1,620 టన్నుల యూరియా విక్రయాలు జరుగగా, నేటికల్లా 230 టన్నుల యూరియా జిల్లాకు రానుంది. ఈ నెల10వ తేదీన 230 టన్నులు, మరో మూడు రోజుల వ్యవవధిలో మరో 730 టన్నుల యూరియా వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకోనుంది. అదనంగా ఏర్పాటు చేసిన ఒక్కో సెంటర్‌లో 5వందల టన్నుల యూరియా స్టాక్ పంపించే అవకాశం ఉంది. జిల్లాలో హాకా, ఓడీసీఎంఎస్, బిజినెస్ సొసైటీలు, ఆగ్రోస్, ఎఫ్‌పీవోతో పాటు ప్రైవేటు దుకాణాలు కలుపుకుని 246 ఉన్నాయి.
పీఏసీఎస్, రైతు వేదికల్లో యూరియా కేంద్రాలు
జిల్లాలో 13 కేంద్రాల గుర్తింపు
పంపిణీదారులకు ఈ–పాస్ యంత్రాల పంపిణీ
అక్రమాలకు తావులేదు..
జిల్లాలో 13 అదనపు యూరియా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణ చేస్తున్నాం. విక్రయ కేంద్రాలకు అవసరమైన ఈ–పాస్ యంత్రాలను అందించాం. ఇక నుంచి రైతులకు ఎలాంటి నిరీక్షణ ఉండదు. యూరియా పంపిణీ వ్యవసాయ విస్తరణ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి ఘటనలు చోటుచేసుకుంటే, కఠిన చర్యలు ఉంటాయి. – షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్

ఊళ్లోనే యూరియా !

ఊళ్లోనే యూరియా !