
వినతుల వెల్లువ
జనగామ రూరల్: పలు సమస్యల పరిష్కారానికి అర్జీలతో ప్రజలు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి తరలివచ్చారు. ప్రజల నుంచి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, అధికారులు 55 దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలు అందించిన దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీవోలు గోపిరామ్, వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు ఇలా..
లింగాలఘన్‌పూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన చర్లపల్లి స్వప్న తన భర్త రమేశ్‌తో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు వరకట్నం కావాలని వేధిస్తూ తనను, పిల్లలను తీసుకెళ్లడం లేదని దరఖాస్తు అందించారు. తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఎర్రవెల్లి మరియ గతంలో తనకు బోదకాలు పింఛన్ మంజూరు అయ్యిందని, ఇటీవల నిలిపివేశారని తనకు పింఛన్ వచ్చేలా చూడాలని దరఖాస్తు అందించారు. చిల్పూర్ మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన జాటోత్ వెంకట్ తన దరఖాస్తు అందిస్తూ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, ఇంటిపై నుంచి కరెంటు వైర్లు వెళ్తుండడంతో ఇల్లు కట్టుకోలేకపోతున్నామని, వెంటనే వైర్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనగామ మండలం సిద్ధంకి గ్రామానికి చెందిన పెద్దపాటి సామ్యూల్ తన దరఖాస్తు అందిస్తూ పి.లక్ష్మమ్మ వద్ద 24/అ/4 సర్వే నెంబర్ ధరణి వచ్చిన దగ్గర నుంచి కనిపించడం లేదని సర్వే చేయించి ఆన్‌లైన్‌లో ఆ సర్వే నెంబర్ నమోదు చేయాలని కోరారు.
క్వారీ పర్మిషన్ రద్దు చేయండి
రఘునాథపల్లి మండలం కోమాల్ల గ్రామంలో క్వారీ పర్మిషన్ రద్దు చేయాలని గ్రామస్తులు దరఖాస్తు అందించారు. క్వారీ వల్ల ప్రకృతికి విఘాతం కలగడంతో పాటు పంట పొలాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. ఆవులు, గొర్రెలు, మేకలు పశు గ్రాసం కోసం ఇంకా గ్రామంలోని అనేక వసతుల విషయంలో మూడు గ్రామాల ప్రజలు ఈ గుట్టపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
ప్రజావాణికి తరలివచ్చిన ప్రజలు
సమస్యలు వెంటనే పరిష్కరించాలని అర్జీలు
55 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు