పింఛన్‌ పెంచాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ పెంచాల్సిందే!

Sep 9 2025 8:37 AM | Updated on Sep 9 2025 2:18 PM

పింఛన్‌ పెంచాల్సిందే!

పింఛన్‌ పెంచాల్సిందే!

జనగామ రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు, చేయూత పింఛన్‌దారులకు పింఛన్‌ పెంచాలని, లేకుంటే ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎమార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. వీహెచ్‌పీఎస్‌, ఏఎస్‌పీ ఆధ్వర్యంలో సోమవారం దివ్యాంగులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా బోడ సునీల్‌, వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్‌ మాట్లాడుతూ..దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ, గీత కార్మికులకు అందించే పింఛన్‌ మొత్తాన్ని హామీ మేరకు పెంచాలన్నారు. ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిర్రు నాగేశ్‌, జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు, జి.కిషోర్‌, సందీప్‌, వెంకటేశ్వర్లు, స్వామి, చక్రపాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.

‘పాలకుర్తి’ రోడ్ల అభివృద్ధికి రూ.21 కోట్లు

పాలకుర్తి టౌన్‌: పాలకుర్తి నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రూ.21కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు మైనారిటీల సంక్షేమ, షెడ్యూల్‌ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మణ్‌ను కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో తండాలు, గూడాలలో రహదారులు దయనీయ పరిస్థితిలో ఉన్నాయని, నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి రూ.21కోట్ల నిదులు వెంటనే మంజూరు చేస్తానని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ ప్రజల తరపున మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

మల్లన్న పుణ్యక్షేత్రాన్ని మాస్టర్‌ప్లాన్‌లో చేర్చండి

జనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా భక్తుల పూజలందుకుంటు న్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయం మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చకపోవడం ఏంటని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి సంవత్సరం మల్లన్న ఖజానా నుంచి సర్కారు సీజీఎం రూపంలో రూ.6 కోట్లు పన్ను వసూలు చేస్తున్నప్పటికీ, కొమురవెల్లి ఆలయ మాస్టర్‌ ప్లాన్‌న్‌లో చోటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆలయాన్ని తక్షణమే మాస్టర్‌ప్లాన్‌నలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

సీపీగెట్‌లో గురుకుల డిగ్రీ విద్యార్థినుల ప్రతిభ

స్టేషన్‌ఘన్‌పూర్‌: స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎంజేపీటీడబ్ల్యూఆర్‌డీసీ(మహాత్మాజ్యోతిరాపు ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌) బీకామ్‌ విద్యార్థినులు రాష్ట్రస్థాయి సీపీగెట్‌–2025 ఎంకామ్‌ ప్రవేశపరీక్షలో విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్‌ భాగ్యలక్ష్మి, డీఎల్‌ ఇన్‌ కామర్స్‌ బి.స్నేహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంకామ్‌ ప్రవేశపరీక్షలో ఎ.తిరుమల రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించగా, జె.నందిని మూడో ర్యాంకుతో సత్తా చాటారని పేర్కొన్నారు. తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటడంపై ప్రిన్సిపాల్‌, అధ్యాపక వర్గం, సిబ్బంది, సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

అర్హత సాధించని సర్వేయర్లకు మరోసారి పరీక్ష

జనగామ: భూసర్వేయర్‌గా ఇటీవల శిక్షణ తీసుకుని అర్హత సాధించని అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించినట్లు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సహాయ సంచాలకుడు మన్యంకొండ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు మరొకసారి అవకాశం కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వేయర్‌ పరీక్షలో పాల్గొనే అభ్యర్థులు సప్లిమెంటరీ పరీక్ష కోసం మీ సేవలో రూ.500లు చలానా తీసి, 10వ తేదీలోగా అందించాలన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement