
ధనయజ్ఞంతో ‘కూలేశ్వరం’
● ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
లింగాలఘణపురం: గత ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధనయజ్జంగా మార్చుకొని కూలేశ్వరం కట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగునీరు అందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పారు. శుక్రవారం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్ నుంచి భువనగిరి ఎంపీ శ్యామలకిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం అధ్యక్షతన జరిగిన సమావేశంలో విప్ బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. నవాబుపేట రిజర్వాయర్‌లోనికి నీళ్లు వచ్చేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంతో శ్రమించారన్నారు. ఉమ్మడి జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి, వర్ధన్నపేటతో పాటు నల్లగొండలోని తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో దేవాదుల ప్రాజెక్టుతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..యూరియా కృత్రిమ కొరత కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. రైతులను రెచ్చగొట్టి యూరియా కొరత సృష్టిస్తున్నారన్నారు. ఎస్‌ఈ సుధీర్, ఈఈ ప్రవీణ్, ఆర్డీఓ గోపీరామ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ జెడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి..
ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో వనిత టీ స్టాల్‌ను డీఆర్‌డీఓ వసంతతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీపీఎం (ఐబీ అండ్ బ్యాంక్ లింకేజీ) శ్రీనివాసు, నాన్‌ఫాం ప్రకాశ్, ఏపీఎం నాగేశ్వర్‌రావు, సీసీలు పాల్గొన్నారు.