
నిమజ్జన శోభాయాత్ర
బొజ్జ గణపయ్యను నవరాత్రులు పూజించారు.. చేతిలో లడ్డూ...మెడలో గరికపోచల దండలు..తీరొక్క పూలతో అభిషేకాలు.. తప్పులుంటే మన్నించయ్యా అంటూ గుంజీలు..ఉదయం, రాత్రి పూజలు..కోలాటం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరూవాడ, పట్టణం, వీధులన్నీ గణేశుడి నామస్మరణతో నిండిపోయాయి. తొమ్మిది రోజుల విఘ్నేశ్వరుడిని భక్తితో పూజించిన ఉత్సవ కమిటీలు, భక్తులు శుక్రవారం నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరారు.
జనగామ పట్టణం, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మండలాల పురవీధులు గణనాథుడి నినాదాలతో మార్మోగాయి. భక్తుల పూజలు, నైవేద్యాలు, అన్నదాన కార్యక్రమాలు అందుకున్న బొజ్జగణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు వందలు, వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం వినాయక.. వెళ్లిరావయ్యా..అంటూ వీడ్కోలు పలుకగా... మళ్లొచ్చే యేడు కలుస్తానంటూ ఏకదంతుడు గంగమ్మ ఒడికి చేరాడు.
– జనగామ
వినాయక నిమజ్జన ఊరేగింపు భక్తుల జయజయ హర్షధ్వానాల మధ్య కొనసాగింది. యాత్రలో మహిళల కోలాటాలు, సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలతో భక్తిని చాటుకున్నారు. జనగామ పట్టణంలోని గణపతులు లింగాలఘణపురం మండలం నెల్లుట్ల, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని చెరువుల వద్దకు నిమజ్జనం కోసం తీసుకు వెళ్లారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నవరాత్రులు జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
కట్టుదిట్టమైన బందోబస్తు..
వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్సైలు, పోలీసులు, జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నెల్లుట్ల, పాలకుర్తి చెరువుల్లో నాలుగు భారీ క్రేన్లు, నాలుగు తెప్పలు, 40 మంది గజ ఈతగాళ్లు, 30 మంది ప్రత్యేక పర్యవేక్షకులు 24 గంటల పాటు అక్కడే ఉండి నిఘా వేశారు.
వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిభిరాలను ఏర్పాటు చేయగా, రెవెన్యూ, మునిసిపాలిటీ, విద్యుత్, 108 అంబులెన్స్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పంచాయతీ ఆయా శాఖలు నిమజ్జన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. శానిటేషన్ కార్మికులు వారం రోజులుగా పని చేయడంతో పాటు రెండు రోజుల పాటు జరిగే నిమజ్జనం సమయంలో సేవలు అందించారు. ఇదిలా ఉండగా నెల్లుట్ల చెరువు వద్ద గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చెరువు ప్రధాన ద్వారం వద్ద గణేశ్ విగ్రహాలతో వచ్చిన వాహనాలను క్రమపద్ధతిలో లోనికి పంపించడంతో రద్దీ తగ్గి నిమజ్జనం సాఫీగా సాగింది.

నిమజ్జన శోభాయాత్ర

నిమజ్జన శోభాయాత్ర

జనగామ