
డ్రెయినేజీలు, రోడ్ల పరిశీలన
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో అధ్వానంగా ఉన్న డ్రెయినేజీలు, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యపై ‘మారని తీరు–మున్సిపాలిటీ అయినా కంపు కొడుతున్న వార్డులు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. మున్సిపల్ పరిధిలోని ఛాగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లిలోని పలువార్డులను కమిషనర్ రాధాకృష్ణ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ఆయా వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీలు, మట్టిరోడ్లు, దెబ్బ తిన్న సీసీ రోడ్లను పరిశీలించారు. అవసరమైన చోట డ్రెయినేజీలు, సీసీ రోడ్లను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని, ఈ మేరకు నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచించారు. వార్డుల్లో చెత్తా చెదారం లేకుండా కార్మికులు బాధ్యతగా పనులు చేయాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ ఏఈ వంశీకృష్ణ, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాస్, సందీప్, నాయకులు బూర్ల శంకర్, పోశాల కృష్ణ, సారంగపాణి, రమేష్, నాగేష్, ఫాతికుమార్, పూర్ణచందర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.