జనగామ: సైనికులు, ప్రధాని మోదీకి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఆలయ ప్రధాన అర్చకులు దత్తుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జాతీయ జెండాతో దేశ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చుంచు శ్రీకాంత్ మాట్లాడుతూ ఇండో–పాక యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అనుమతిస్తే సైన్యంలో చేరేందుకు తనతో పాటు కిరణ్, రాజు, వినయ్, సంతోష్ తదితరులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు
లింగాలఘణపురం: పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నా రు. శనివారం మండలంలోని జనగామ–సూర్యాపేట రోడ్డులోని కుందారం క్రాస్ రోడ్డు వద్ద పశువుల అక్రమ రవాణాను నివారించేందుకు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురష్కరించుకొని ఇష్టారాజ్యంగా పశువులను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని, పశువైద్యాధికారి ధ్రువీకరించిన పశువులను మాత్రమే తీసుకెళ్లాలన్నారు. బక్రీద్ వరకు చెక్‌పోస్టు 24 గంటలు పని చేస్తుందని తెలిపారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై శ్రావణ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పద్మశ్రీ సమ్మయ్యకు సన్మానం
దేవరుప్పుల : మండల పరిధి అప్పిరెడ్డిపల్లెకు చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్యను బీఆర్‌ఎస్ అనుబంధ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్మానించారు. శనివారం హైదరాబాద్‌లో ఆమె స్వగృహానికి సమ్మయ్యను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గ్రామీణ సాంస్కృతిక కళారంగానికి వన్నెతెచ్చేందుకు వందలాది ప్రదర్శనలు ఇచ్చిన సమ్మయ్యను ప్రశంసించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాముయాదవ్, సమ్మయ్య కుటుంబ సభ్యులు గడ్డం సోమరాజు, మురళీకృష్ణ, హిమగిరి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాము ఎంపిక
రఘునాథపల్లి: మహారాష్ట్రలో వార్దా జిల్లా డియోలి పట్టణంలో ఈనెల 12 వరకు జరిగే 51వ జాతీయ స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలకు మండలంలోని రామరాయనిబంగ్లా గ్రామానికి చెందిన సీహెచ్.రాము ఎంపికయ్యాడు. గత నెల 28న రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీల్లో రాము అత్యున్నత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారపాక రాజయ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా రామును అసోసియేషన్ బాధ్యులు చిట్ల ఉపేందర్‌రెడ్డి, గాండ్ల మల్లికార్జున్, కొయ్యడ మల్లేష్, శాగ తిరుమలేష్, ఎడ్ల శ్రీనివాస్, గొంగల్ల కుమార్, రాజశేఖర్ తదితరులు అభినందించారు.
లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ నిర్వహించే లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మీ–సేవ కేంద్రాల్లో ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంట ర్మీడియట్‌లో గణిత శాస్త్రం ఒక అంశంగా ఉన్నవారు, కనీసం 60శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.

సైనికులకు ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలు