వసూలు చేసిన డబ్బులు వాపస్‌ | - | Sakshi
Sakshi News home page

వసూలు చేసిన డబ్బులు వాపస్‌

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● కొండ్రికర్లలో పెన్షన్ల మార్పిడికి వసూళ్లు ● కార్యదర్శిని సంజాయిషీ కోరిన అధికారులు ● ఇంటింటికీ వెళ్లి ఇచ్చిన కారోబార్‌

● కొండ్రికర్లలో పెన్షన్ల మార్పిడికి వసూళ్లు

మెట్‌పల్లిరూరల్‌: ‘చేయూత పెన్షన్ల మార్పిడికి డబ్బులు వసూలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చి.. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ప్రక్రియ ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చేయాలి. కానీ.. మెట్‌పల్లి మండలం కొండ్రికర్లలో ఒక్కో పెన్షన్‌దారు నుంచి పంచాయతీ సిబ్బంది రూ.200 వసూలు చేశారు. ఈ వసూళ్ల వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మెట్‌పల్లి ఇన్‌చార్జి ఎంపీడీవో రామకృష్ణ ఆరా తీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి రాజును ఆదేశించారు. మరోవైపు వసూలు చేసిన డబ్బులను కారోబార్‌ వినోద్‌ పెన్షన్‌దారుల ఇంటింటికి వెళ్లి తిరిగి ఇచ్చినట్లు తెలిసింది. గ్రామంలో 400కు పైగా పెన్షన్లు ఉండగా.. కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు చేయూత

రాయికల్‌: ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించిన మండలంలోని భూపతిపూర్‌కు చెందిన న్యాతగిరి సంజన, రాజ్‌దీపక్‌కు అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రూ.30 వేలు ఆర్థిక సహాయం పంపించారు. ఈనెల ఒకటిన ‘సరస్వతి పుత్రులకు లేని లక్ష్మీ కటాక్షం’శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అసోసియేషన్‌ సభ్యులు రూ.30వేలు పంపించగా.. వాటిని గ్రామస్తుల సమక్షంలో విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుర్రం భావన, సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు ముత్యంరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్‌ జక్కుల చంద్రశేఖర్‌, నాయకులు జక్కుల ప్రసాద్‌, అన్నవేని వేణు, రాము, శేఖర్‌, సాగర్‌, విష్ణు, మహేశ్‌, ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణి, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, కూరగాయల సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement