జగిత్యాల: ‘సర్కారు ఆస్పత్రిలో కార్పొరేట్‌కు ధీటుగా సౌకర్యాలున్నాయి.. మెరుగైన వైద్యం పొందండి..’ అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. వైద్య సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. జగిత్యాల పట్టణానికి చెందిన గంగరాజం ఇటీవల ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి బంధువులు జిల్లాఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో వైద్యులు లేరని, ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. ఆరోగ్యశ్రీ ఉండడంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రి వేసిన బిల్లుతో ఆందోళన చెంది.. తిరిగి సర్కారు ఆస్పత్రికే చేరారు. చికిత్స చేయాల్సిన సిబ్బంది మళ్లీ పాత సమాధానమే చెప్పారు. ఇప్పుడు ఏకంగా కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గత్యంతరం లేక సదరు కుటుంబం ఓ ప్రైవేటు అంబులెన్స్‌ను మాట్లాడుకుని కరీంనగర్ బయల్దేరారు. అయితే జగిత్యాల శివారుకు చేరగానే అంబులెన్స్‌ను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో గంగరాజం భార్య మంజుల చేయికి గాయమైంది. వెంటనే భార్యాభర్తలిద్దరినీ మళ్లీ జిల్లా ఆస్పత్రికే తీసుకొచ్చారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. ఈ విషయమై ఆస్పత్రి ఆర్‌ఎంవో విజయ్‌రెడ్డిని వివరణ కోరగా.. గాయం పెద్దది కావడంతో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని ఎవరికీ సూచించలేదని, ఎవరు చెప్పారో చెబితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.


