నాన్నను పట్టుకు తిరిగిన లోగిలి
అమ్మను తాకితే తీరిన ఆకలి
బుడి బుడి అడుగుల జాబిలి
విహార యాత్రపు జాలీ జాలీ
నా మదిలో బాల్యపు రంగుల హోలీ
సోపతి గాళ్లతో గోలీలాట..
భూపతి గానితో జలకాలాట..
సీతాపతితో జాతర పాట..
యాకుబ్ తోటలో కోతి కొమ్మచ్చీ
జేకే వాడలో కాల్ చిచ్చి ముచ్చీ
బాల్యపు ఊసుల ఉయ్యాలా..!
సొంటి తెచ్చినా కంట్లో మంట
చంటి తెచ్చినా ఇంట్లో తంట
గద్యం చదవక కోదండాలు
పద్యం చదవక అరదండాలు
బాల్యం నేర్పిన గుణ పాఠాలు..
అయ్యోరిచ్చిన ఐదు పైసలు
పూజారిచ్చిన పూత రేకులు
ఇసుకలో కట్టిన పిచ్చుక గూళ్లూ
కాగితప్పడవల వర్షపు నీళ్లూ
మరచిపోనివీ మరలి రానివీ..
బాల్యం ఇచ్చిన బహుమతులు
చెరువులో పట్టిన చేప పిల్లలు
చేతిలో కాలిన అగ్గి పుల్లలు
బడి మానేసి చూసిన చిత్రం
బిర బిర గీసిన నల్లని ఛత్రం
గిర గిర తిరిగిన రంగుల రాట్నం
బిర బిర ఉరికిన హంగుల పట్నం
ఇంకా ఇంకా గుర్తున్నాయి.
ఇంపుగ మదిలో దాగున్నాయి!
డాక్టర్ కటుకోఝ్వల రమేశ్
కవి, రచయిత
జిల్లా: ఖమ్మం


