మక్కకు మద్దతు ధర లేక విలవిల్లాడుతున్న అన్నదాతలు ఆటల్లో మునిగితేలుతున్న సీఎం, మంత్రులు జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
మల్లాపూర్: రాష్ట్రంలో రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని, అన్నదాతలు రోడ్డెక్కి విలపిస్తుంటే.. సీఎం, మంత్రులు ఆటల్లో మునిగితేలుతున్నారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. మండలకేంద్రంలోని భరతమాత కూడళి వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతు మొక్కజొన్న పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోందన్నారు. అకాలవర్షాలు, ఈదురుగాలులతో పంట నష్టపోయి.. అరకొరగా వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే మద్దతుధర లేక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులు కోరుకున్న చోట కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎస్సై లక్ష్మయ్య చేరుకుని వారితో మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, రైతుబంధు కమిటీ మాజీ జిల్లా సభ్యుడు డీలర్ మల్లయ్య, బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


