కోరుట్ల/ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ పాలనలో చేపలు, గొర్రెలు అందించడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో బుధవారం 30మంది లబ్ధిదారులకు రూ.9.11 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బడ్జెట్‌లో కొత్త పింఛన్ల ఊసు లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ రైతుబంధు అందిందని, ఈ ప్రభుత్వంలో యాసంగి పంటలు చేతికొచ్చినా స్పందన లేదని పేర్కొన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించినా.. ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎలాల దశరథ్‌రెడ్డి, సర్పంచు బద్దం గోపి, ఉప సర్పంచు నాంపెల్లి రమేశ్, మాజీ కో–ఆప్షన్ ఏలేటి చిన్నారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.29 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


