మల్యాల: హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జయంతి ఏర్పాట్లను ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. ఆలయం పరిసరాల్లోనే 64 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. హెల్ప్‌సెంటర్, వైద్య శిబిరాలు, మెట్లదారిలో లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దీక్ష విరమణ, ప్రసాదాల కౌంటర్లు, క్యూలైన్ల వద్ద బందోబస్తు కల్పించాలన్నారు. పార్కింగ్ స్థలంతోపాటు నీటి వసతి, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 24గంటలు అంతరాయం లేకుండా సేవలు కొనసాగాలన్నారు. పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. స్వామివారి దీక్షాపరుల కోసం వేములవాడ, జగిత్యాల, కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, డీపీఓ మదన్ మోహన్, ఆలయ ఈఓ అంజనారెడ్డి, మల్యాల సీఐ నీలం రవికుమార్, ఎంపీడీఓ స్వాతి, తహసీల్దార్ వసంత, ఎస్సై నరేశ్‌కుమార్, ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి పాల్గొన్నారు.


