కొట్టిన హాస్టల్ కుకింగ్ హెల్పర్
జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ కుకింగ్ హెల్పర్ శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వస్తూ విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులను ప్రతిరోజు చీపుర్లతో కొడుతూ వేధిస్తున్నాడు. విషయాన్ని కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించారు. అయినా శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లడంతో ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం విచారణ చేపట్టారు. తమను కొడుతూ.. వేధిస్తున్నట్లు విద్యార్థులు తెలపడంతో నివేదికను కలెక్టర్‌కు అందించారు. ఆయన వెంటనే శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ ఇటీవలే డిప్యూటేషన్‌పై తాళ్లధర్మారం నుంచి ఇక్కడికి వచ్చాడు.


