పీఏసీఎస్‌ సొమ్ము రికవరీ అయ్యేనా..? | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌ సొమ్ము రికవరీ అయ్యేనా..?

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

మెట్లచిట్టాపూర్‌ సొసైటీ అధికారుల నిర్లక్ష్యం 2018 నాటి పాలకవర్గంలో అక్రమాలు అప్పట్లోనే విచారణలో తేల్చిన అధికారులు ఏళ్లు గడుస్తున్నా దృష్టి సారించని వైనం

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం మెట్లచిట్లాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అప్పట్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించినా.. డబ్బులు రికవరీలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొందరు రైతులు రుణాలు తీసుకోకున్నా ఇచ్చినట్లు చూపడం.. ఎరువుల విక్రయాలు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చిన సొమ్ము పక్కదారి పట్టడంతో అధికారులు విచారణ జరిపి నిజమేనని గుర్తించారు. ఆ సొమ్ము సిబ్బంది సొంతానికి వాడుకున్నట్లు తేల్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2018 వరకు కొనసాగిన పాలకవర్గం సమయంలో జరిగిన ఈ అక్రమాలపై అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించినప్పటికీ.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రికవరీ మాత్రం చేయలేదు. శ్రీపోయింది మా సొమ్ము కాదు కదాశ్రీ అన్నట్లు.. అధికారుల తీరు ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రూ.45.48 లక్షలు అక్రమాలు జరిగినట్లు..

మెట్లచిట్టాపూర్‌ పీఏసీఎస్‌ పరిధిలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. 2018 వరకు కొనసాగిన పాలకవర్గం సమయంలో రైతులకు తెలియకుండా వారి పేరిట రూ.27.77 లక్షలు రుణం కింద తీసుకున్నారు. అలాగే యూరియా, విత్తనాల అమ్మకాలు, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో వచ్చిన సొమ్ము నుంచి రూ.17.71 లక్షలు పక్కదారి పట్టించారు. సొసైటీ అక్రమాల తంతు విషయం ఉన్నతధికారుల దృష్టికి వెళ్లగా విచారణ జరిపి అవినీతి జరిగినట్లు తేల్చారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అనంతరం పాలకవర్గం రద్దు చేయడంతో పాటు అప్పటి సీఈవోను విధుల నుంచి తొలగించారు.

రికవరీ విషయంలో నిర్లక్ష్యం..

పక్కదారి పట్టించిన సొమ్మును బాధ్యుల నుంచి రికవరీ చేసే విషయంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నారు. ఈ అక్రమాలు బయటపడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ సొమ్మును బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయలేదు. అక్రమాల వ్యవహారం బయటపడిన సమయంలో కేసు నమోదు చేశారే తప్ప రికవరీ మాత్రం చేయలేదు. మరోవైపు సొమ్ము రికవరీ కానిపక్షంలో బాధ్యులకు నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ స్పందించని పక్షంలో ఆస్తులు జప్తుచేసేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తెలిసింది. ఉన్నతాధికారులు దృష్టి సారించి పక్కదారి పట్టించిన సొమ్మును రికవరీ చేస్తే ఆ సొమ్ము సొసైటీ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement