కోరుట్ల: డ్రైవర్లు వాహనాలను భద్రంగా నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల, మెట్‌పల్లి లారీ, ఐచర్ ఇతర వాహన డ్రైవర్లు, ఓనర్లకు సోమవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతోనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించటం అరైవ్ అలైవ్ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, నివారణ చర్యలే అవసరమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం వాహనాలకు రేడియం స్టిక్కర్లు అతికించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత, మెట్‌పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు, సీఐలు అనిల్, సురేష్ బాబు, ఎస్సైలు చిరంజీవి, రాంచంద్రం, కిరణ్, శ్రీధర్ రెడ్డి, రవికిరణ్, లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


