కోరుట్ల: మీ సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేది నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. మీ సేవ దరఖాస్తులకు గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతోంది. మీ సేవలో దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరిలు రెండు రకాలు ఉండగా రెండింటిలోనూ చార్జీల పెంపు జరిగింది.
రెట్టింపు చార్జీలు..
మీ సేవలో దరఖాస్తులను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ–ఏ కింద వచ్చే దరఖాస్తులకు ఇదివరకు రూ.35 యూజర్ చార్జీ కాగా.. పెంచిన రేటు ప్రకారం రూ.62 కానుంది. కేటగిరీ–బీ కింద వచ్చే దరఖాస్తులకు ఇప్పటివరకు రూ.45 చెల్లిస్తుండగా.. రేపటి నుంచి రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.53గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ. 4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18, రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు. యూజర్ చార్జీల పెంపు ఒకేసారి రెట్టింపు చేయడం..దానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం భారంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


