జగిత్యాలరూరల్: జిల్లాలోని పారాబాయిల్డ్ రైస్‌మిల్లర్లకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించినా ఆ సమయంలోగా బియ్యం సేకరించకపోవడంతో మిల్లుల్లో వేలాది మెట్రిక్ టన్నుల వరిధాన్యం పేరుకుపోతోంది. కాగా, మళ్లీ 15 రోజుల్లో రబీ ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిల్లర్లు తాము ధాన్యాన్ని తీసుకోలేమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సింగారావుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.
మిల్లర్లకు తప్పని కష్టాలు
జిల్లాలో పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు 100 ఉండగా గతంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీల ద్వారా మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు బియ్యాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా కేంద్రం రెండు పంటలకు సంబంధించిన బియ్యం తీసుకోవడం లేదు. మిల్లుల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. దీంతో జిల్లాలో రెండునెలలుగా మిల్లులను మూసివేశారు. ఈనేపథ్యంలో హమాలీ చార్జీలు, ఆపరేటర్లు, వర్కర్లకు నెలనెలా వేతనాలు, కరెంట్ బిల్లులు మీద పడుతుండటంతో మిల్లర్లకు ఆర్థికంగా సంక్షోభంలో పడుతున్నారు. దీంతో రబీ సీజన్ ధాన్యాన్ని తీసుకోమని ప్రభుత్వానికి ముందస్తుగానే సమాచారం అందిస్తున్నారు.
సంక్షోభంలో మిల్లర్లు
కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మిల్లులు నెలకొల్పిన యజమానులు నిర్వహణ భారంతో సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వరిధాన్యం గోదాముల్లో పేరుకుపోయి తుప్పు పట్టే పరిస్థితి ఉండగా, ప్రభుత్వం మాత్రం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా బియ్యం అప్పగించాలని సూచిస్తుంది. ఏళ్ల తరబడి నిల్వ ఉన్న ధాన్యం రంగుమారే అవకాశాలు ఉండటంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.
● మంత్రి అడ్లూరికి వినతిపత్రం సమర్పించిన మిల్లర్లు


