జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీలో 20 నెలలుగా ఎదురవుతున్న అవమానాలు భరించలేకే 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని వీడాల్సి వచ్చిందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని బండారి గార్డెన్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సభలో అభిమానులు, అనుచరుల సమక్షంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా రు. ఆయనకు మద్దతుగా వివిధ హోదాల్లో ఉన్న నా యకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ముందుగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి కొనసాగిన కాంగ్రెస్ పార్టీని వీడడం కష్టంగా ఉన్నప్పటికీ తప్పలేదన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఎన్నికల సభలు, విజయోత్సవ సభలు నిర్వహించానని, పార్టీ వీడేందుకు ఇలాంటి సభ పెట్టాల్సి రావడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో తనకు పేరు రావడానికి కారణమైన అనుచరులు, అభిమానులు, నాయకులకు రుణపడి ఉంటానని తెలిపారు.
విజయలక్ష్మి రాజీనామా
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలి పదవితోపాటు కాంగ్రెస్ పార్టీకి తాటిపర్తి విజయలక్ష్మి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా రాజీనామా చేశారు.
జీవన్‌రెడ్డితో తుల ఉమ భేటీ
జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ జీవన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలైన ఉమ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బతికపల్లి సర్పంచ్..
పెగడపల్లి: మండలంలోని బతికపల్లి సర్పంచ్ ముంజ మహేశ్వరీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి పార్టీతోపాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. మాజీ సర్పంచులు తాటిపర్తి ప్రభాకర్‌రెడ్డి, నంచర్ల మాజీ సర్పంచ్ గోలి మహేందర్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు.
నర్సింహులపల్లి వార్డు సభ్యుడు..
కొడిమ్యాల: మండలంలోని నర్సింహులపల్లెకు చెందిన రెండో వార్డు సభ్యుడు మేడిపల్లి బాపురెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జీవన్‌రెడ్డికి విలువ లేని చోట తాము ఉండలేమని పేర్కొన్నారు.
వెల్గటూర్ ఏఎంసీ చైర్‌పర్సన్..
వెల్గటూర్: వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుండాటి గోపిక తన పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జీవన్‌రెడ్డి తమకు రాజకీయ గురువు అని, ఆయనకు గౌరవం లేని పార్టీలో తాము ఉండలేమని పేర్కొన్నారు. పదవుల కన్నా ఆత్మాభిమానం గొప్పదని, విలువ లేని చోట ఉండలేమని తెలిపారు.
కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా
40 ఏళ్ల అనుబంధానికి భావోద్వేగ వీడ్కోలు
ఆయనకు మద్దతుగా పలువురి రాజీనామా


