పైసా కొట్టు.. సర్టిఫికెట్‌ పట్టు | - | Sakshi
Sakshi News home page

పైసా కొట్టు.. సర్టిఫికెట్‌ పట్టు

Mar 26 2026 7:51 AM | Updated on Mar 26 2026 7:51 AM

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో అవినీతి చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఈ ఆస్పత్రికి సుమారు 280 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు వచ్చారు. ప్రొహిబిషన్‌ కాలం పూర్తి చేసుకున్న వారు రెగ్యులరైజేషన్‌ ఫైల్‌ను డీపీహెచ్‌కు పంపాలంటే ఇక్కడి అధికారులు అమ్యామ్యాలు అడుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. అడిగినంత ఇస్తేనే ఫైల్‌ పంపిస్తామని సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నట్లు బాహాటంగానే పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఎన్‌వోసీ కోసం..

ఇక్కడ పనిచేస్తున్న నర్సింగ్‌ ఆఫీసర్లు ఏయిమ్స్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ అవసరం. ఆ సర్టిఫికెట్‌ కావాలని దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ఆస్పత్రి శాఖలో పనిచేస్తున్న అధికారులు రూ.15వేల వరకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వాడు అడిగినంత ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకుంటుండగా.. మరికొందరు ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఓ నర్సింగ్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ విచారణ చేపట్టాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు.

అడిగినంత ఇస్తేనే...

జనరల్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది అడిగినంత ఇస్తేనే ఫైల్స్‌ ముందుకు కదులుతాయట. నర్సింగ్‌ ఆఫీసర్లు ఇందులో 280 మంది పనిచేస్తుండగా.. వారి రెగ్యులరైజేషన్‌కు సంబంధించి డీపీహెచ్‌కు ఫైల్‌ పంపించాల్సి ఉంటుంది. వీటికోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. పైఅధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిసింది.

అధికారులపై విచారణ

నర్సింగ్‌ ఆఫీసర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఆ సెక్షన్‌లో పనిచేస్తున్న అధికారులను వేరే శాఖకు పంపించినట్లు తెలిసింది. ఏదేమైనా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పేర్కొంటున్నారు.

జనరల్‌ ఆస్పత్రిలో అవినీతి బాగోతం

ఎన్‌వోసీ కోసం లంచం డిమాండ్‌

డబ్బులిస్తేనే ఫైల్‌ కదిలేది..

‘జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రంలో పని చేస్తున్న ఓ నర్సింగ్‌ ఆఫీసర్‌ ఏయిమ్స్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి నోఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అందులో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ను సంప్రదించగా.. రూ.15వేల లంచం డిమాండ్‌ చేసినట్లు సదరు అధికారి ప్రజావాణిలో ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేసింది. అందులో పనిచేస్తున్న ఆర్‌ఎంవో, ఏడీ కూడా మాటలతో వేధిస్తూ.. మానసిక వేధనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement