జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు తప్పనిసరి

Mar 25 2026 7:27 AM | Updated on Mar 25 2026 7:27 AM

ఎక్కువగా నీరు తీసుకోవాలి

ఒంటిపూట బడి..

పెద్దపల్లి: ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత బడిలేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటాపాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులను గ్రహించాలి.

పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి

ఒంటిపూట బడిసమయంలోనూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా..

పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో ప్రస్తుతం నీరు నిల్వఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదుల సంఖ్యలో ఉంటున్నాయి.

డ్రైవింగ్‌ మోజులో..

ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్‌, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టిలోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటలు ఆడిపించాలి.

జాగ్రత్తలు అవసరం

ఉదయాన్నే కచ్చితంగా అల్పాహారం పెట్టి పాఠశాలలకు పంపించాలి. నీళ్లసీసా వెంట ఉంచాలి. ఉదయం 7.30 గంటల్లోపు బడికి పంపించేందుకు శ్రద్ధ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు వడ్డిస్తారు. దూరప్రాంతాల విద్యార్థులు ఎండలో నడిచి వెళ్లకుండా ఆటోలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి.

పిల్లలను కంట కనిపెట్టాల్సిందే..

ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం

ఆటలపై దృష్టి సారించేలా చూస్తే బెటర్‌

పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైన కొద్దీ పిల్లలు ఆహారం తీసుకునేందుకు మారాం చేసే అవకాశముంది. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి.

– డాక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, పీహెచ్‌సీ, గర్రెపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement