జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి చోరీకి పాల్ప డ్డారు. గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి ఉపాధి నిమిత్తం ముంబయ్ వెళ్లాడు. దొంగలు చొరబడి పావుతులం బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
మత్తు మందు చల్లి బంగారం చోరీ
జమ్మికుంట: మాటమాట కలిపి.. మత్తు మందు చల్లి రెండు తులాల బంగారం చోరీ చేసిన ఘటన జమ్మికుంట మండలం మడిపల్లిలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం మడిపల్లి గ్రామానికి చెందిన కస్తూరి రమ పిండిగిర్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని వచ్చి, పిండి పడుతారా అంటూ మాట కలిపి ముఖంపై మత్తుమందు స్ప్రే చేశాడు. స్పృహ కోల్పోగానే మెడలోని రెండు తులాల పుస్తెలతాడు చోరీ చేసి పారిపోయాడు. రమ స్పృహలోకి వచ్చి లబోదిబోమంటూ బోరున విలపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు.
కారు ఢీకొని ఒకరి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్– మోరపల్లి గ్రామాల మధ్య జగిత్యాల – రాయికల్ ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు గాడిపల్లి లక్ష్మణ్ (40) మృతిచెందాడు. రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై చల్‌గల్ నుంచి సింగరావుపేటకు వెళ్తున్నాడు. కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి లక్ష్మణ్ బైక్‌ను ఢీకొనడంతో కిందపడిపోయిన లక్ష్మణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోక్సో కేసులో ఒకరి అరెస్ట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలకేంద్రానికి చెందిన పుట్టకొక్కుల రంజిత్‌ను పోక్సో కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిరిసిల్ల డీఏస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాలు.. రంజిత్ కొన్నినెలలుగా రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా అనుభవించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాహుల్‌రెడ్డి కేసు నమోదు చేశారు. డీఏస్పీ నాగేంద్రచారి కేసు దర్యాప్తు చేశారు. రంజిత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
అట్రాసిటీ కేసు నమోదు
జమ్మికుంట: కులంపేరుతో దూషించిన ఇద్దరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి ఇంటి స్థలం ఎదుట ఇసుక పోయించిన నూరి రామకృష్ణ, మేడిపల్లి సదానందంను ప్రశ్నించాడు. దీంతో వారు కులంపేరుతో దూషించి, దాడికి యత్నించారు. భాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


